- నీతిఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రభావవంతంగా వినిపించారు.
- ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం పార్లమెంటులో పోరాడాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసిన సందర్భంలోనూ, ప్రత్యేక హోదా విషయంలో మోడీ మనసు మార్చాలని ఆయనను కోరారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు నాకు ఇరవైకి పైగా పార్లమెంట్ స్థానాలను ఇవ్వండి. ప్రత్యేక హోదాను తెచ్చి చూపిస్తాను అంటూ ప్రసంగాలు చేశారు. ఆయన కోరిన విధంగానే ప్రజలు 22 స్థానాలలో వైసిపిని గెలిపించారు. గెలిచిన అనంతరం జగన్ గారు మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి కూటమికి 250 స్థానాలలోపే రావాలని తాను కోరుకున్నానని, దేవుడు తన కోరికను మన్నించలేదని, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉందని అన్నారు. అయినా తాము కేంద్రం ఇచ్చే వరకు వారిని అడుగుతూనే ఉంటామని కూడా తెలిపారు.
జగన్ గారు చేసిన ఈ ప్రకటన వాస్తవికంగా ఉంది. కాని, కేంద్రాన్ని హోదాకోసం అడగడం లేదు అనే విమర్శలను మూటగట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. రాజకీయ అవసరాల దృష్ట్యా కేంద్రంతో పోరాటానికి సంసిద్ధంగా లేరు. ఈ విషయాన్ని కన్నా లక్ష్మీ నారాయణ మరియు పీయూష్ గోయల్ గార్లు, ప్రత్యేక హోదా సాధ్యం కాదు, అది ముగిసిన అధ్యాయమే అంటూ చెప్పినప్పటికీ, వారిపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం స్పష్టం చేస్తుంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు పార్లమెంట్లో కార్యకలాపాలను అడ్డుకున్నారు, ఎంపీలు రాజీనామా చేశారు, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమించడం లేదని తప్పుపట్టారు. కాని, అధికారంలో ఉండి ఉద్యమాలు చేయడం, రాజీనామాల బాటపట్టడం, ప్రతిపక్షంలో ఉండి విమర్శలు చేసినంత సులభం కాదు. ప్రభుత్వమే ఉద్యమాలు చేస్తే, రాష్ట్రంలో పాలన స్తంభించి సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయి.
ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారి వద్ద పెద్దగా ప్రత్యామ్నాయాలు లేవు. ఆయన హోదా కోసం ప్రయత్నిస్తున్నారన్న భావనను సాధ్యమైనన్ని వీలైనన్ని సార్లు ప్రజలలోకి తీసుకెళ్లడాన్నిమార్గంగా ఆయన ఎంచుకున్నారు. ఈ విధానంలో భాగంగానే గత రెండు రోజుల పరిణామాలు సంభవించాయని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ప్రత్యేక హోదా వలన లాభం ఉండదనడం వలన ఆయనకు జరిగిన నష్టాన్ని జగన్ గారు గమనించారు. అందువలన ఐదేళ్లపాటు హోదా కావాలని నిరంతరంగా అడుగుతూనే ఉంటారు. ఇది ఇప్పుడు, ఆయన రాజకీయ అవసరం మరి.
Post a Comment