నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రుల విజ్ఞప్తుల వెనుక....

నీతిఆయోగ్ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులు, తమ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ, కేంద్ర సహాయాన్ని అభ్యర్థించారు.
  • ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని, ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించాలని, ఇంటింటికీ మంచినీటిని అందించే ప్రాజెక్టుకు నూరుశాతం గ్రాంటును మంజూరుచేయాలని ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ అభ్యర్థించారు. 
  • వరదలతో అతలాకుతలమైనతమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కోరారు. 
  • పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని, శాసనసభ నిర్మాణానికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి వి.నారాయణసామి కోరారు. 
  • తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న కర్ణాటకకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.
  • వరదలు, ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్న అసోంను ఆదుకోవాలని ముఖ్యమంత్రి సర్బానంద్‌ సోనోవాల్‌ అభ్యర్థించారు.
  • తమిళనాడులో చేపడుతున్న ప్రాజెక్టులకు, సంక్షేమ పథకాలకు సహాయం అందించాలని ముఖ్యమంత్రి కె.పళనిస్వామి కోరారు.
  • విభజనతో ఆర్థికలోటును ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు.  
ఇలా చిన్న, పెద్ద అన్ని రాష్ట్రాలు నిధుల కోసం కేంద్రాన్ని అభ్యర్థించాయి. నిధులు అభ్యర్థించిన వాటిలో బిజెపి పాలనలో లేని రాష్ట్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా!, బిజెపి పాలిత రాష్ట్రాలకు నిధుల సమస్యలు లేవా? అంటే వారికి కూడా ఉన్నాయి. కాని, వారు తమ అధినాయకత్వాన్ని ప్రత్యేకంగా కలిసి నిధులు కోరతారు. ఇతరులు ఇలా బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. అంతే, తేడా!

ఇలా అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని ఎందుకు అభ్యర్థించవలసి వస్తుంది? రాష్ట్రాలు వాటి ఆర్థిక అవసరాలకు నిధులను సమకూర్చుకోలేవా? అంటే ఖచ్చితంగా సమకూర్చుకోలేవనే చెప్పాలి. దేశ ప్రధాన ఆదాయ వనరులను, పన్నులను మరియు ముఖ్యమైన శాఖలను కేంద్రం తమ అధీనంలో ఉంచుకుంది. రాష్ట్రాలు తమ అవసరాల కోసం కేంద్రం పంపిణి చేసే నిధులపై ప్రవేశపెట్టే పథకాలపై ఆధారపడవలసిందే. ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ ప్రవచించిన సమాఖ్య (ఫెడరల్) స్ఫూర్తికి విరుద్ధమైనా, రాష్ట్రాలు ఏం చేయలేకపోతున్నాయి. 

మన దేశంలో ఉన్న రాష్ట్రాలలో వివిధ రకాలైన పరిస్థితులున్నాయి. వేరు వేరు రాష్ట్రాలకు, వేరు వేరు అవసరాలు, ప్రాథమ్యాలున్నాయి. కాని రాష్ట్రాలకు చాలా అంశాలలో తమ సొంత విధానాలు రూపొందించుకునే అధికారంగాని, నిధులుగాని లేవు. కేంద్రం వివిధ రాష్ట్రాల నుండి వసూలు చేస్తున్న పన్నులను, వాటి పంచడంలో ఉన్నహేతుబద్దత మరియు అసమానతలను మరొకసారి వివరంగా చర్చిద్దాం.     

ఇదే నీతిఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి గారు సమానత్వం, భారత జట్టు అంటూ ప్రవచనాలు చెప్పారు. కొన్ని అంశాలలో రాష్ట్రాలకు స్వాతంత్య్రం ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోరు. ఉదాహరణకు కేంద్రం ఈ సమావేశంలో, వ్యవసాయ రంగంపై, జలవనరులపై దృష్టి సారించాలని, ఎగుమతులను పెంచాలని సూచించింది. అంటే రాష్ట్రాలు ఎప్పుడు, ఏం చేయాలో కేంద్రమే నిర్ణయిస్తుందన్నమాట. 

జలవనరులపై, వ్యవసాయ విధివిధానాలపై అన్ని రాష్ట్రాలను ఒకే గాటన ఎలా కడతారు?, కొన్ని రాష్ట్రాలలో కరువు, కొన్ని రాష్ట్రాలలో వరదలు ఉన్నాయి. మద్దతు ధర, రాయితీలు మొదలైనవి కూడా కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కేంద్రం, విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధన, రాష్ట్రాల మధ్య వివాదాలు లాంటి కీలకమైన విషయాలపై మాత్రమే అధికారాన్ని ఉంచుకుని మిగిలినవి రాష్ట్రాలకు అప్పగిస్తే మేలు. అప్పుడు ఏ రాష్ట్రానికి, తమకు అన్యాయం జరుగుతుందన్న భావన ఉండదు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post