విడతల వారీగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలులోకి తీసుకు రానున్నామని, నెలకు ఒక రూపాయి మాత్రమే వేతనంగా తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గారు మరో విషయంలో కూడా ఎన్‌టిఆర్ గారిని అనుసరించనున్నట్లు తెలుస్తుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిని రద్ధు చేయడంపై తీవ్రస్థాయిలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 58 మంది సభ్యులు ఉన్న రాష్ట్ర శాసన మండలిలో తెలుగు దేశం పార్టీ పూర్తి మెజారిటీని కలిగి ఉంది. శాసన సభ ఆమోదించే బిల్లులన్నింటికీ మండలి ఆమోదం పొందడం కూడా తప్పనిసరి కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2014లో కెసిఆర్ గారు, మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. కానీ ఆయన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల నుండి ఫిరాయింపులను ప్రోత్సహించి మండలిలో ఆయనకు అవసరమైన మెజారిటీని సాధించుకున్నారు. కానీ ఫిరాయింపులపై చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన, జగన్ గారు ఇప్పుడు అదే విధమైన ఎత్తుగడలను అనుసరించడానికి అంత సుముఖంగా లేరు.
1985లో ఉమ్మడి రాష్ట్రములో ఎన్‌టిఆర్ గారికి కూడా శాసన మండలిలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు, ఆయన ఏకంగా మండలిని రద్దు చేసే నిర్ణయం తీసుకున్నారు. అయితే మండలి రద్దు అనేది కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితులలో ఖర్చును తగ్గించుకునే చర్యలలో భాగంగా జగన్ గారు దీనికే మొగ్గు చూపవచ్చనే వార్తలు వస్తున్నాయి.
ఈనాటి పరిస్థితులలో అన్ని పార్టీలు మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ తరహా అవసరాలకు అతీతుడేమీ కాదు. సర్దుబాట్లలో భాగంగా శాసన సభ ఎన్నికలలో టిక్కెట్లు లభించని వారి నుండి శాసన మండలి సీట్ల కోసం ఆయనపై రాజకీయ ఒత్తిడులు ఉన్నాయి. ఒకవేళ సాహసోపేతంగా రద్దు నిర్ణయం వైపే మొగ్గు చూపితే, ఇప్పటికే ఈ హామీలు పొందిన వారిని ఆయన మరో విధంగా సర్దుబాటు చేయవలసి ఉంటుంది.
Post a Comment