భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వనున్నారా?

ఆచారాలను పాటించడంలో ముందుండే కెసిఆర్ గారు భద్రాద్రి ప్రాంతాన్ని అప్పగిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారక వార్త వచ్చే వరకు నమ్మలేము.

హైదరాబాద్‌లో నిరుపయోగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన భవనాలను ముఖ్యమంత్రి జగన్ గారు, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వారికి అప్పగించారు. ఎలాగూ ఈ పాలనా కాలం ముగిసిన తరువాత అప్పగించవలసిన భవనాలను ముందుగా అప్పగించి నందుకు ప్రతిగా భద్రాద్రి ప్రాంతాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ కు అప్పగిస్తున్నారని ఒక వర్గం మీడియా అకస్మాత్తుగా ప్రచారంలోకి తెచ్చింది. దీనిని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ధృవీకరించలేదు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు భద్రాచలం ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉండేది. రాష్ట్ర విభజన సమయంలో  భద్రాచలం తమకే కావాలంటూ ఇరుప్రాంతాలు పట్టుబట్టాయి. తరాల నుండి హైదరాబాద్ పాలకులు పాటిస్తున్న కొన్ని ఆచారాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని తెలంగాణకు కేటాయించడం జరిగింది. అయితే పోలవరం ముంపు సమస్య వలన ఆ ప్రాంతంలోని ఏడు మండలాలను మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసారు. ఆ సమయంలో రామాలయానికి  సంబంధించిన భూములు ఉన్న నాలుగు గ్రామాలు కూడా ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయి. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భద్రాచల ప్రాంతం మరియు ఆలయం పేరును భద్రాద్రిగా మార్చడం జరిగింది. ఈ భద్రాద్రి రాముని ఆలయం ఒక చోట మరియు భూములు మరొక చోట ఉండటం సరికాదని ఆలయ భూములు ఉన్న ప్రాంతాలను తెలంగాణకే తిరిగి ఇవ్వాలని విభజన సమస్యల పరిష్కార చర్చల సందర్భంగా ఆ రాష్ట్రం అనేకసార్లు కోరింది.         
ఆచారాలను పాటించడంలో ముందుండే కెసిఆర్ గారు భద్రాద్రి ప్రాంతాన్ని అప్పగిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారక వార్త వచ్చే వరకు నమ్మలేము. ఈ వార్తలను రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఒక వర్గం చేస్తున్న కుట్రగా కూడా కొందరు పేర్కొన్నారు. 

అలా వచ్చిన వార్తలలో కొన్ని మరీ విచిత్రంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ సామర్థ్యం ముందు అనుకున్న దానికన్నా ఎక్కువ చేయడం వలన ప్రతి ఏటా కొన్ని నెలల పాటు ఆలయం కూడా మునిగిపోతుందని, భూసేకరణ కోసం ఆ ప్రాంతాన్ని అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఒకవేళ అదే నిజమయితే కరకట్ట కట్టడం లాంటి చర్యలు తీసుకుని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఆలయాన్ని పరిరక్షించాలి. ఇంకా ఏవయినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. కాని, మేము ముంచేస్తాం, ఇచ్చేయండి అనడం భావ్యం కాదు. కేవలం అక్కడ ప్రజలు ఉండే ప్రాంతాలను మాత్రమే సేకరించదలచుకుంటే, రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న సృహృద్భావ సంబంధాల దృష్ట్యా సరియైన పరిహారం ఇస్తే కెసిఆర్ గారు కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది.

దీనిని అనవసర వివాదం చేయకుండా ఇరు రాష్ట్రాలు చర్చించి భద్రాచలం ప్రాంత ప్రజల అభీష్టం ప్రకారం వారు ఎక్కడ ఉండాలనుకుంటే, అక్కడ ఉండనివ్వాలి. ఆలయాన్ని, ఆలయ భూములను ఒకే ప్రాంతంలో ఉంచి మరింత అభివృద్ధి చెందేలా చూడాలి. ఒకవేళ ముంపునకు గురయ్యే ప్రమాదం గనక ఉంటే తక్షణం నివారణ చర్యలు చేపట్టాలి. వివాదాలు రగిలించి దక్షిణ అయోధ్యను మరో అయోధ్యగా మార్చొద్దు.                      
Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget