బాక్సైట్ తవ్వకాలపై ఉద్యమాలు - మాట నిలబెట్టుకున్న జగన్

బాక్సైట్ తవ్వకాలపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇవాళ కలెక్టర్లు, ఎస్‌పిల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు వద్దని కోరుకుంటున్నప్పుడు తవ్వకాలు చేయడంలో అర్థం లేదన్నారు. 

బాక్సైట్ మైనింగ్ జరగకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదని జగన్ అన్నారు. ఇక నుంచి  ఏజెన్సీలో మైనింగ్‌ చేసే ప్రసక్తే లేదని, గిరిజనుల్లో విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గిరిజనులు మావోయిస్టుల్లో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి జీవనోపాధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రానికి శాంతి, ప్రశాంతత ముఖ్యం అని గుర్తుంచుకోవాలని అధికారులకు ఆయన ఉద్బోధించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై కూడా ఆయన నివేదిక కోరారు.  

ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన మాట 

జగన్‌ గారు గతంలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తామని అనేక సార్లు ప్రస్తావించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రాంత గిరిజనులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.     

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు  

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో చాలా కాలంగా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుండి ఇవి కొనసాగుతున్నాయి. ఆ సమయంలో జిందాల్, ఆన్‌రాక్ కంపెనీలకు బాక్సైట్ తవ్వకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ సమయంలో తెలుగుదేశంతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళనలు చేయడంతో ఆ అనుమతులను రద్దు చేశారు. చంద్రబాబు గారే స్వయంగా బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. 

తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, బాక్సైట్ తవ్వకాలకు అనుమతిని మంజూరు చేసింది. 1212 హెక్టార్ల భూమిలో 222.84 మిలియన్ టన్నుల బాక్సైట్ తవ్వకం కోసం జీవో నెంబర్ 97 ను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీతో సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఈ జీవోను వ్యతిరేకించాయి. ఆ ప్రాంతంలోని తెలుగు దేశం ప్రజా ప్రతినిధులు కూడా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించడమే కాకుండా, ఈ జీవో వల్ల తమకు మావోయిస్టుల నుండి ప్రాణహాని కలుగుతుందని చంద్రబాబు గారికి మొరపెట్టుకున్నా ఆయన వినలేదు. తవ్వకాలకు పోలీసుల రక్షణ కూడా కల్పించారు.

పవన్ ఆరోపణలు - జనసేన శ్రేణుల అత్యుత్సాహం 

ఎన్నికల సమయంలో, ఱంపచోడవకంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు, వైసిపి అధికారంలోకి వస్తే, జగన్ బాక్సైట్‌ ఖనిజాన్ని దోచేస్తారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తామంటూ జీవో జారీ చేయనుండడంతో, తమ ఒత్తిడితోనే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post