విద్యుత్ ఒప్పంద నష్టాలను ప్రభుత్వం రికవరి చేయగలదా?

సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న పిపిఎల వల్ల,  రాష్ట్ర ప్రభుత్వానికి గత మూడేళ్లలో జరిగిన నష్టం 2,636 కోట్ల రూపాయలని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. తక్కువ ధరలకు కొనే అవకాశమున్నా, కావాలని ఎక్కువ ధరలకు ఒప్పందాలను కుదుర్చుకున్నారని, వీటినన్నింటినీ సమీక్షిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. పిపిఎలను కుదుర్చుకున్న సంస్థలతో సంప్రదింపులు జరిపి వాటిని మార్చి తక్కువ ధరతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని, నష్టపోయిన మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఆయన తెలిపారు. 

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు (పిపిఎలకు) చట్టబద్దత ఉంటుంది. ఒకసారి వాటిని అంగీకరించిన తరువాత, వాటిని సమీక్షించడం గాని, రద్ధు చేయడం గాని అంత సులభం కాదు. ఆ ఒప్పందంలో అవినీతి జరిగిందని ప్రభుత్వం రుజువు చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసుకుంటే ఆ సంస్థలకు భారీ పరిహారం చెల్లించవలసి ఉంటుంది. సంస్థలతో జరిగే చర్చలలో వాటిని ఒప్పించి భవిష్యత్తులో కొంత తక్కువ ధరకు కొనేలా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. కాని, రికవరీ అనేది దాదాపుగా అసాధ్యమే. జగన్మోహన్ రెడ్డి గారు, పిపిఎలపై సమీక్ష జరుపుతాను అనగానే కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి దానికి అభ్యంతరం తెలుపుతూ, లేఖ రాశారంటేనే విద్యుత్ సంస్థల లాబీ ఎంత బలంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.   

ప్రజలకు మూడు నాలుగు రూపాయలకు, ఒక యూనిట్‌ విద్యుత్‌ను ఇవ్వవలసిన ప్రభుత్వం, తామే పిపిఎలలో ఐదు నుండి పది రూపాయలకు యూనిట్‌ చొప్పున కొంటుంటే విద్యుత్ ధరలు పెరగక ఏమవుతాయి? పిపిఎలు కుదుర్చుకునే సమయంలోనే, ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చును రెండు, మూడు రెట్లు పెంచి చూపించడం, ఏడాదికి 10-20% లాభదాయకత పేరిట ప్రయివేటు విద్యుత్ సంస్థలకు దోచిపెట్టడం, పాలకులకు అలవాటయ్యాయి. రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థల గుత్తాధిపత్యం, వాటిలో ఉన్న విపరీతమైన అవినీతి, అలసత్వం మరియు అధిక వేతనాలు కూడా వీటితో కలిసి ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయి. 

విద్యుత్ సంస్థలలో జరిగే కొనుగోలు ఒప్పందాలలో అవినీతి ఇప్పుడు తెలుగు దేశం ప్రభుత్వంలో కొత్తగా మొదలైంది కాదు. చంద్రబాబు గారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఇలా ప్రయివేటు సంస్థల నుండి విద్యుత్ కొనుగోలు మొదలైంది. ఆ తరువాత పదేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ హయాంలో కూడా ఈ తరహా పిపిఎలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమీక్షలతో ఈ వ్యవస్థలో పెద్దగా మార్పులు వచ్చే అవకాశమైతే లేదు. వ్యవస్థాగతంగా వేళ్లూనుకుపోయిన అవినీతిని నిరూపించడం కష్టమే. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంది. కనీసం ఒక్క ఒప్పందంలో అవినీతిని నిరూపించగలిగినా, అది జగన్ గారి ఘనతేనని అంగీకరించవచ్చు.   

0/Post a Comment/Comments