ఇరు రాష్ట్రాల ప్రభుత్వ స్కూళ్లలో భారీగా అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ఇలా విద్యార్థుల సంఖ్య పెరగడానికి రెండు రాష్ట్రాలలో వేరు, వేరు కారణాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మ ఒడి పథకం కేవలం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకే వర్తిస్తుందని వస్తున్న వార్తల వల్ల, తమ పిల్లలను ఈ స్కూళ్లలో చేర్చేందుకు బారులు తీరుతున్నారు. కొన్ని స్కూళ్లలో ఇప్పటికే ఎక్కువ మంది చేరడం వల్ల 'అడ్మిషన్లు పూర్తయ్యాయి' అని బోర్డులు కూడా పెడుతుండడం విశేషం.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అనేక గురుకులాలను నిర్మించారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపడడం, ప్రయివేటు స్కూళ్ల ఫీజులు భారీగా పెరగడం తదితర కారణాల వలన విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో గత సంవత్సరం ఇదే సమయానికి ప్రభుత్వ స్కూళ్లలో 1.86 లక్షల మంది విద్యార్థులు చేరగా, ఈ సంవత్సరం ఈ సంఖ్య మూడు లక్షలు దాటినట్లు ప్రాథమిక విద్యాశాఖ వెల్లడించింది. జులై చివరికి అడ్మిషన్ల సంఖ్యపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.
Post a Comment