విమానాశ్రయంలో తనిఖీలపై రాద్ధాంతం

గన్నవరం విమానాశ్రయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారి వాహనాన్ని భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఆయనను ఇతర ప్రయాణికుల మాదిరే భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి అనుమతించారు. అక్కడ నుండి రన్‌వే పైనున్న విమానం వరకు, అందరితో కలిసి ప్రయాణికుల బస్‌లోనే చంద్రబాబు వెళ్లారు.

ఆయనకు మాజీ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా హోదాలు ఉన్నాయని, జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉందని, ఆయనను నేరుగా అనుమతించకుండా అవమానించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వారికి మద్ధతునిచ్చే మీడియా వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. 

అయితే,  మనదేశంలో ఉన్న విమానాశ్రయాలలో ఎవరిని నేరుగా అనుమతించాలి? ఎవరికి భద్రతా తనిఖీలు నిర్వహించాలి? అనేది కేంద్ర పౌరవిమానయాన సంస్థ పరిధిలోకి వస్తుంది. దీనికోసం ఆ సంస్థ స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది. ఈ నియమాల ప్రకారం మొత్తం 32 హోదాలు గల వ్యక్తులకు, మరియు వారితో ఉన్నప్పుడు వారి భార్య/భర్తలకు భద్రతా తనిఖీల నుండి మినహాయింపు ఉంది. 
 1. రాష్ట్రపతి 
 2. ఉపరాష్ట్రపతి 
 3. ప్రధానమంత్రి 
 4. అన్ని రాష్ట్రాల గవర్నర్లు 
 5. మాజీ రాష్ట్రపతులు 
 6. మాజీ ఉపరాష్ట్రపతులు 
 7. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 
 8. పార్లమెంట్ స్పీకర్ 
 9. కేంద్ర మంత్రులు 
 10. రాష్ట్రాల ముఖ్యమంత్రులు 
 11. రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు 
 12. ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్ష్యుడు 
 13. పార్లమెంట్ ఉభయ సభలలో ప్రతిపక్ష నేతలు 
 14. భారతరత్న గ్రహీతలు 
 15. విదేశీ రాయబారులు 
 16. సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు 
 17. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ 
 18. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 
 19. రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ మరియు లోక్‌సభ డెప్యూటీ స్పీకర్ 
 20. యూనియన్ కౌన్సిల్ మినిస్టర్లు 
 21. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా 
 22. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ 
 23. లెఫ్టినెంట్ గవర్నర్లు 
 24. త్రివిధ దళాల అధిపతులు మరియు జనరల్ ర్యాంక్ ఉన్నవారు 
 25. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 
 26. కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు  
 27. కేంద్రపాలిత ప్రాంతాల ఉప ముఖ్యమంత్రులు    
 28. దేశానికి వచ్చే ఇతరదేశాల ప్రధానులు, అధ్యక్ష్యులు (ఆయా దేశాలలో పైన వాటిలో 1-4 వరకు మరియు 7,8,9 హోదాలు గలవారు)
 29. దలైలామా 
 30. SPG రక్షణ ఉన్నవారు  
 31. రాష్ట్రపతి భార్య/భర్త 
 32. మాజీ ప్రధానమంత్రులు 
ఈ జాబితా ప్రకారం మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రతిపక్ష నేత, జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నవారికి తనిఖీల నుండి మినహాయింపు లేదు. టిడిపి వర్గాలకు ఇది తెలియదనుకోవాలా? తెలిసి కూడా రాద్ధాంతం చేస్తున్నారా?, ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ గారిని కూడా అందరి ప్రయాణికుల తరహాలో భద్రతా తనిఖీల అనంతరమే అనుమతించేవారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, తమ నిబంధనలు మారిస్తే తప్ప చంద్రబాబు గారికి ప్రత్యేక సౌకర్యాలు వచ్చే అవకాశమే లేదు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post