పారిశ్రామిక వేత్త మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వివేకానంద్ గారు బీజేపీలో చేరనున్నారు. వెంకటస్వామిగారి కుమారుడిగా రాజకీయాలలోకి వచ్చిన ఆయన, గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. దీనికి ఆయన తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు మరియు దురదృష్టాలను కారణాలుగా చెప్పవచ్చు.
వివేక్ గారు, 2009లో మొదటి సారి కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. తెలంగాణ వాదిగా పేరుపడ్డ ఆయన, అధికార పార్టీలో ఉంటూ బహిరంగంగానే ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలకు మద్ధతు పలికేవారు. V6 ఛానెల్‌ను ప్రారంభించి ఉద్యమానికి తనవంతు తోడ్పాటునందించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనతో ఈ విషయమై తీవ్ర విభేదాలు రావడంతో కాంగ్రెస్‌ను వదిలి టిఆర్ఎస్‌లో చేరారు.
ప్రత్యేక తెలంగాణ సాకారమయ్యాక వివేక్ గారు, 2014 ఎన్నికలకు ముందు మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో కెసిఆర్ గారు వారించినప్పటికీ వినిపించుకోలేదు. ఆ ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన ఆయన, బాల్క సుమన్ చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం కొంతకాలం స్తబ్దంగా ఉండి, మళ్ళీ టిఆర్ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో తాను ఆశించిన వారికి టిఆర్ఎస్ పార్టీ టికెట్లు లభించలేదన్న కారణంతో కొంతమందిని ఓడించడానికి ప్రయత్నించాడన్న వార్తలు వచ్చాయి.
గత లోక్‌సభ ఎన్నికలలో పెద్దపల్లి స్థానం నుండి ఆయన టిఆర్ఎస్ టికెట్‌ను ఆశించారు. స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం మరియు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడని వార్తలు రావడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ సమయంలో బిజెపి జాతీయ నేత రాంమాధవ్ స్వయంగా వివేక్‌తో మాట్లాడి, హైదరాబాద్ పిలిపించుకొని మరీ పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి నుండి పోటీ చేయమని కోరారు. ఆ సమయంలో బిజెపికి తెలంగాణాలో పెద్దగా ఓట్లు లభించవని భావించిన ఆయన దానికి ఆసక్తి చూపలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం బిజెపికి భారీగా ఓట్లు రావడం, నాలుగు స్థానాలలో విజయం సాధించడంతో, పోటీ చేస్తే తాను కూడా గెలిచేవాడినని చింతించారట. ఇలా రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఆయనకు కలిసి రాలేదు. ఇప్పుడు ఆయన బిజెపిలో చేరనుండడంతో, ఏం జరుగనుందో వేచిచూడాలి.
Post a Comment