ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ అనంతరం తెలుగు దేశం ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన అజయ్ కల్లం గారికి, కొత్త ప్రభుత్వంలో కీలక స్థానం లభించింది. ఆయనను జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అందరు కార్యదర్శులకు నాయకత్వ హోదాలో ఆయన పనిచేయనున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు, విభాగాలకు సూచనలు, సలహాలు ఇవ్వడం ఆయన విధులుగా అందులో పేర్కొన్నారు. ఈ పదవి ద్వారా ఆయనకు కేబినెట్ హోదా కూడా లభించింది. ఈ నియామక కాల పరిమితి మూడు సంవత్సరాలు. ఈ సమయంలో నెలకు 2.5 లక్షల వేతనంతో పాటు ఆయన పేషీలో పది మంది సిబ్బందిని కూడా నియమించుకోవచ్చు.
కెసిఆర్ గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే నర్సింగరావు గారిని ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. అయితే ఆయన అప్పటికే, కోల్ ఇండియాలో అంతకన్నా పెద్ద వేతనంతో, పెద్ద హోదాలో పనిచేసేవారు. ఈ నియామకంతో జగన్ గారు కూడా కెసిఆర్ గారి తరహాలో కేంద్రీకృత వ్యవస్థగా పనిచేస్తారని భావించవచ్చు.
అజయ్ కల్లం గారు, టీటీడీ ఈవోగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఛైర్మన్‌గా, ఆర్థిక, రెవెన్యూ శాఖలలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసారు. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ వైఫల్యాలు, రాజధాని నిర్మాణంలో అవకతవకలపై పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. అమరావతిలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తప్పుపట్టారు. రాజధాని ముసుగులో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తుందని దుయ్యబట్టారు. అజయ్ కల్లం గారు ఈ పదవికి అన్ని విధాలా అర్హులే అయినప్పటికీ, ఈ విమర్శలతో ముఖ్యమంత్రి దృష్టిలో పడ్డారని భావించవచ్చు.
Post a Comment