చంద్రబాబు నాయుడు గారి సమీక్షా సమావేశాలు అంటే ఐఏఎస్ అధికారులతో సహా క్షేత్ర స్థాయి అధికారులు కూడా భయపడిపోయే వారు. ఉదయం మొదలు పెడితే అర్ధరాత్రి వరకూ అవి కొనసాగేవి. ఒక్కొక్క సారి ఆయన రోజుల తరబడి సమీక్షలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆ సమావేశాలలో చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్న అనుభవంతో మొదలు పెట్టి, ప్రపంచ దేశాలలో వ్యవస్థలు ఎలా ఉన్నాయి? అంటూ గంటల (రోజుల?) తరబడి ఉపన్యాసాలు ఇస్తూ, అధికారులకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చేవారు కాదు. అసలు సమీక్ష జరిపే అంశం పక్కకు వెళ్ళేది. ఒక్కొక్కసారి చాలా కష్టపడుతున్నానని, కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుందని తన మీద తానే జాలి చూపించుకునేవారు. యోగా చేస్తూ ఎంత క్రమ శిక్షణతో ఉంటున్నాను? జొన్నరొట్టె ఎందుకు తింటున్నాను? అప్పట్లో హైదరాబాద్‌ను ఎలా నిర్మించాను? బిల్ క్లింటన్‌ను, బిల్ గేట్స్‌ను ఎలా రప్పించాను? లాంటి స్వోత్కర్షలు కూడా వినిపించేవారు.
పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించవలసిన అధికారులను కూడా సమీక్షల పేరిట వారంలో ఒకటి, రెండు రోజులు రోజంతా కూర్చోపెట్టేవారు. అధికారుల సూచనలను వినకుండా, చివరిలో ఒకరిద్దరిని మందలించి ''రోజంతా సమీక్ష జరిపిన బాబు", "అధికారుల తీరుపై ఆగ్రహం" లాంటి శీర్షికలతో తరువాత రోజు ఉదయం పత్రికలలో కనిపించేవారు.
ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు జరిపిన సమీక్షలు బాబుగారి శైలికి భిన్నంగా ఉన్నాయి. ముందుగా సమీక్ష జరిపే అంశంపైన అధికారులు చెప్పింది విని, వాటిలో ఏమైనా మార్పు చేర్పులు అవసరం అనిపిస్తే సూచిస్తున్నారు. క్యాబినెట్ సహచరులు కూడా లేకపోవడంతో ఈ ప్రక్రియ అంతా గంట, రెండు గంటల లోపే పూర్తి అయింది. అధికారులు కూడా ఈ పద్ధతిపై సంతృప్తి వ్యక్తం చేసారు. అయితే పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్న తరువాత కూడా ఇదే శైలి సమీక్షలు జరుపుతారా? లేక మారతారా? అనేది వేచి చూడాలి.
Post a Comment