ఉప ముఖ్యమంత్రులకు అప్రధాన శాఖలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 25 మంది మంత్రులు, 5 మంది ఉప ముఖ్యమంత్రులతో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుతీరింది.  మంత్రివర్గ కూర్పు వెనుక సామాజిక, ప్రాంతీయ సమతుల్యత సాధించడానికి భారీ కసరత్తు చేసినట్లు కనిపిస్తుంది.  

మంత్రి పదవుల కోసం అనుభవం, సీనియారిటీ  వంటి వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. శాఖల కేటాయింపులోనూ అదే విషయం స్పష్టం అయింది. కేవలం ఆరుగురికి మాత్రమే ఇంతకు ముందు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. తన తండ్రి బాటలో పయనిస్తున్నానని తెలియచేయటానికే సుచరిత గారికి హోంమంత్రిత్వ శాఖను కేటాయించారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఆర్ధిక శాఖ దక్కింది. ఆయనకు ఆర్ధిక విషయాలపై అవగాహన ఉండటం, పిఎసి చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉండటం కలసివచ్చాయి.

ఇక ఉప ముఖ్యమంత్రి పదవులు పూర్తిగా సామాజిక వర్గ ప్రాతిపాదికనే కేటాయించారు. వారిలో కేవలం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాత్రమే ఇంతకు ముందు మంత్రిగా పనిచేశారు. ఆయనకు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖను కేటాయించారు. ఇతర ఉప ముఖ్యమంత్రులందరికీ అప్రాధాన్య శాఖలే దక్కాయి. ఉప ముఖ్యమంత్రులలో శ్రీవాణి గారికి గిరిజన సంక్షేమ, ఆళ్ల నాని గారికి వైద్య ఆరోగ్య, అంజాద్ భాషా గారికి మైనారిటీ సంక్షేమం, నారాయణస్వామి గారికి ఎక్సయిజ్ శాఖలు దక్కాయి.  

ఉప ముఖ్యమంత్రి ఉన్న ప్రతి ప్రాంతంలో అంతకన్నా కీలకమైన శాఖను మరో మంత్రికి కేటాయించడం గమనార్హం. ఆ ప్రాంతంలో వారి అధికారాన్ని బ్యాలన్స్ చేయడానికే ఈ విధమైన కూర్పు జరిగినట్లుగా భావించాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post