ప్రజావేదిక కూల్చివేత ఎందుకు? ప్రజాధనం వృధా మాటేమిటి?

ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఈ భవనంలో ఇదే చివరి సమావేశమని,  దీని అనంతరం ప్రజావేదికను కూల్చివేయాలని నిర్ణయించడం రాజకీయ వర్గాలలో, సామాన్య ప్రజలలో పెద్ద చర్చకు దారితీసింది.

ప్రజావేదిక నిర్మాణం ఎలా జరిగింది?

కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజావేదిక భవనాన్ని నిర్మించింది. ఈ నిర్మాణాన్ని సిఆర్‌డిఎ చేపట్టింది. కరకట్టకు, నదికి మధ్యలో నిర్మాణం తలపెట్టినందున కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఈ భవనానికి అనుమతిని నిరాకరించారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని లోకాయుక్త ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. భవన నిర్మాణానికి మునిసిపల్ శాఖ అనుమతులు కూడా తీసుకోలేదు. ఇలా ఎటువంటి అనుమతులూ లేకపోయినా సిఆర్‌డిఎ 5కోట్ల అంచనా వ్యయంతో కాంట్రాక్టరుకు పనులు అప్పగించింది. అప్పటి మంత్రి నారాయణ మౌఖిక ఆదేశాలతో 5కోట్ల అంచనాలను 8.90 కోట్లకు పెంచేశారు. చివరకు రూ.7.59 కోట్ల వ్యయంతో ప్రజావేదిక నిర్మాణం పూర్తయింది. ఇలా నియమ నిబంధనలన్నీ బేఖాతరు చేస్తూ ప్రజావేదిక నిర్మాణం జరిగింది.  

ప్రజావేదిక కూల్చివేతపై ప్రభుత్వవాదన 

ప్రభుత్వమే నిబంధనలను ఉల్లంఘించి అక్రమ భవనాలను నిర్మించి, వాటిని ఉపయోగిస్తుంటే ఇక తప్పు చేసే వారిని ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదికతోనే ప్రారంభం కావాలి. అని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగంలో వెల్లడించారు.  

తెలుగుదేశం వర్గాల వాదనలేమిటి?
  • ఈ భవనం కూల్చివేత వలన అమూల్యమైన ప్రజాధనం వృధా అవుతుందని, ఆ భవనం చంద్రబాబు గారికి కేటాయించకుంటే, ప్రభుత్వమే ఉపయోగించుకోవాలి. 
  • ప్రజావేదికని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటామని అడిగినందువల్లే ప్రభుత్వం దాని కూల్చివేత నిర్ణయం తీసుకుందని, ఆయన నివాస భవనాన్ని కూడా కూల్చే ఉద్ధేశ్యంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని, ఇది ఆయనపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలలో భాగమని వారు అంటున్నారు. 
నిబంధనలు పాటించకుండా రాజధాని సంస్థ ఎలా నిర్మాణాలను చేపట్టింది? లాంటి వివరణలు తెలుగుదేశం నాయకుల నుండి రాలేదు.  

అక్కడ ఉన్న మిగతా నిర్మాణాల మాటేమిటి? 

చంద్రబాబు గారి నివాసం, ప్రజావేదికలే కాకుండా కరకట్టపై అనేక అక్రమ నిర్మాణాలున్నాయి. గోకరాజు గంగరాజు గారి విశ్రాంతి భవనం, మంతెన సత్యనారాయణ గారి ప్రకృతి ఆశ్రమం లాంటి నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ ఉన్న భవన యజమానులు కొంతమంది ఇప్పటికే  కోర్టునుండి, వాటిని కూల్చకుండా స్టేలు తెచ్చుకున్నారు.   

ప్రభుత్వం తమ నిర్మాణాన్ని కూల్చివేసుకుంటున్న విధంగానే, అక్కడ ఉన్న అన్ని ప్రయివేటు నిర్మాణాలను నోటీసులు ఇచ్చి కూల్చివేయగలదా? ముఖ్యంగా గోకరాజు గంగరాజు గారు బిజెపి ప్రముఖుడు. ఆయన ఈ నివాసానికి ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారే వచ్చారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవడం, కలెక్టర్ల సమావేశంలో ఆదర్శాలు చెప్పినంత సులభమైతే కాదు.

ప్రభుత్వం క్రమబద్దీకరణ చేయగలదా?    

పర్యావరణ నింబంధనలను ఉల్లంఘిస్తూ నదీ గర్భంలో, నీటివనరులపై చేపట్టిన నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్దీకరించలేదు. దీనిపై అనేకసార్లు హై- కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.    

ప్రజాధనం వృధా మాటేమిటి? 

నిబంధనలు పాటించకుండా రాజధాని సంస్థ, ఈ నిర్మాణం చేపట్టడం క్షమించరాని నేరం. నిర్మాణం కోసం ఆదేశాలు జారీ చేసిన మంత్రులు, అధికారులు, నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, నిధులు విడుదల చేసిన అధికారులతో సహా అందరిపై విచారణ జరపాలి. ప్రజాధనాన్ని వారి నుండి వసూలు చేసే మార్గాలను అన్వేషించాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post