ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నిరుపయోగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేస్తూ రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేసారు. వీటిపై బకాయి ఉన్న పన్ను మొత్తాలను రద్దు చేయవలసిందిగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.
హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని కావటంతో, విభజన సమయంలో ఇక్కడి పరిపాలన భవనాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాటా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన అమరావతికి మారిన తరువాత ఆ భవనాలు నిరుపయోగంగా మారిపోయాయి. కానీ నెల నెలా వాటి నిర్వహణకు, ప్రతి సంవత్సరం చెల్లించవలసిన ఆస్తి తదితర పన్నుల రూపేణా భారం పడుతోంది. అంతేకాకుండా నిరుపయోగంగా ఉండటంతో అవి క్రమంగా శిథిల దశకు చేరుకుంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం కూడా కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న అసెంబ్లీ, సచివాలయం మరియు ఇతర భవనాలను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంతో ఉన్న రాజకీయ విభేదాల వలన చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ విషయమై సత్వర నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నారు. కాని, ఈ భవనాలను ఇప్పుడు ఇవ్వకున్నా మరో నాలుగు సంవత్సరాల అయినా ఇవ్వవలసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్‌లో తన క్యాంపు కార్యాలయం కోసం ఒక భవనం, పోలీసు విభాగానికి, సమావేశాల నిర్వహణ కోసం చెరో భవనం కావాలని కోరగా తెలంగాణ ప్రభుత్వం దానికి అంగీకరించింది. అలాగే అప్పగించిన భవనాలపై ఉన్న 8 కోట్ల రూపాయల పన్ను బకాయిలను కూడా రద్దు చేసింది.
దీనిని జగన్మోహన్ రెడ్డి గారు రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావం నెలకొనడానికి వేసిన ముందడుగుగా భావించవచ్చు. ఇక రెండు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న ఇతర విభేదాలు
- తొమ్మిది, పది షెడ్యూల్లోని సంస్థల విభజన హైదరాబాద్‌లోని భూముల విషయంతో ముడిపడి ఉండటంతో పరిష్కారం క్లిష్టంగా మారింది. భూములను ఆ సంస్థలు కొనలేదని, ప్రభుత్వమే ఇచ్చిందని, అవి తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర వాదనగా ఉంది. రెండు రాష్ట్రాలు కొంత పట్టు విడుపులతో వ్యవహరించి వాటిని కూడా పరిష్కరించుకుంటాయని భావిద్దాం.
- కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారం ట్రిబ్యునల్ చేతిలో ఉంది. గోదావరి నదిలో రెండు రాష్ట్రాలు వాడుకోగా ఇంకా వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఇక్కడ పెద్దగా వివాదం లేదు.
- విద్యుత్ బకాయిల విషయంపై ఆంధ్రప్రదేశ్ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ కోర్టుకు వెళ్ళింది. ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో థర్మల్ విద్యుత్ కి అయ్యే వ్యయం యూనిట్ కి 50 పైసల నుండి 2 రూపాయల వరకు తక్కువ. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు పంపిణీ అయిన విద్యుత్ 500MW. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తాము తెలంగాణ నుండి తక్కువ ధరకు 2000 MW విద్యుత్ ను కొంటున్నట్టు, తాము ఎక్కువ ధరకు 2500 MW విద్యుత్ అమ్ముతున్నట్లు లెక్కలు వేసుకుని బకాయిలను 4400 కోట్లుగా లెక్కతేల్చాయి. కాగా తెలంగాణ, తాము కేవలం 500MW మాత్రమే తీసుకున్నామని వాటికి సరిపడా బిల్లులను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని కోరుతుంది. రెండు రాష్ట్రాలు కలిసి చర్చించుకుంటే దీనిని పరిష్కరించుకోవచ్చు.
ఇవి కాకుండా ఉన్న ఇతర విభజన సమస్యలు చిన్నవే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిని సులభంగా పరిష్కరించుకోగలరు.
Post a Comment