మంత్రులు స్వతంత్య్రంగా నిర్ణయాలు తీసుకోగలరా?

సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏకస్వామ్యం నడుస్తుంది. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ మద్దతిస్తారు. అందులోని లోటుపాట్లని ఎవరూ ప్రశ్నించరు. ఇది జగన్, కెసిఆర్, చంద్రబాబులలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మారదు. 

జగన్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. దానిలో ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. చర్చ కూడా ముఖ్యమంత్రి మనోగతం ప్రకారం హామీల అమలు విధి విధానాలపైనే జరిగింది. కానీ, వీటికి అవసరమైన ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారు? అనే కీలకమైన అంశంపై ఎటువంటి చర్చ జరగలేదు. ఎవరూ కనీసం ప్రస్తావించే సాహసం చేయలేదు. 

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిపోతుంది, 90% ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అంటూ భ్రమలలో ఉండేవారు. పక్కన ఉన్న మంత్రులు, అధికారులు వాస్తవం తెలిసి కూడా, ఎవరూ ఆయనను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. విలేఖరులు లాంటి వారు, ఎప్పుడైనా ప్రశ్నించినా ఆయన తీవ్రస్థాయిలో స్పందించేవారు.

కెసిఆర్ గారి పాలన అంతా సిఎం పేషీ నుండే సాగుతుంది. ఆయనకు అన్ని శాఖలను అజమాయిషీ చేసేంత మంది అధికారులు అక్కడ ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే జరుగుతాయి. మంత్రులు కేవలం అక్కడ జరిగిన నిర్ణయాలను అమలు పరుస్తారు. స్వతంత్రించి తీసుకునే నిర్ణయాలు తీసుకోవడం తక్కువే.

ప్రస్తుతం, జగన్ గారు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం విషయంలో కెసిఆర్ గారినే అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది. మంత్రులకు తమ శాఖలకు సంబంధించి, సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఇస్తారా? అనేది అనుమానమే.

0/Post a Comment/Comments