మద్య నిషేధంపై వెనక్కి తగ్గబోనని రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దశలవారీగా మద్యాన్ని తగ్గిస్తామని, ఐదేళ్లలో మద్యాన్ని కేవలం స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని, ఆ తరువాతే 2024 ఎన్నికలకు వెళతామని ఆయన అన్నారు. ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇస్తామని కూడా అన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉంది. సంవత్సరంలో అనేకసార్లు ఓవర్ డ్రాఫ్టుకు వెళితేగాని జీతాలు, బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నవరత్నాలతో పాటు ఆర్థికంగా ఖజానాపై భారమయ్యే మరెన్నో హామీలను నెరవేర్చవలసి ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 5,789.67 కోట్లు. ఈ సంవత్సరం (2018-19) లో ఏడువేల కోట్లకు చేరనుందని అంచనాలున్నాయి. 2022-23 నాటికి ఈ శాఖ ఆదాయం 10వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. మద్య నిషేధం వలన ఏర్పడే ఆర్ధిక లోటును తట్టుకోవడం కష్టమే.
మద్య నిషేధం అమలు అనేది ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. జిఎస్టి అమలు వలన రాష్ట్రాల సరిహద్దులలో ఇప్పుడు చెక్ పోస్టులు కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్రమ మద్యాన్ని కట్టడి చేయడం కూడా కష్టసాధ్యం. నిషేధం యొక్క ప్రధాన లక్ష్యం నీరుగారకుండా, ఈ సమస్యలన్నింటిపై ఏ విధంగా ముందుకెళతారు అనేది ఆసక్తికరమే.
Post a Comment