జనసేన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుంది?

ఎన్నికల ఫలితాల ముందువరకు  తాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలమని, కనీసం కింగ్ మేకర్ పాత్రనైనా పోషిస్తామని జనసేన శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేసాయి. కానీ ఫలితాలు వారిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసాయి. 

జనసేనపార్టీ రాష్ట్రంలో కేవలం 5.35% ఓట్లను మాత్రమే సాధించగలిగింది. రాష్ట్రంలో ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే విజయం సాధించగలిగింది. అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన భీమవరం, గాజువాకలలో కూడా రెండవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అమలాపురం, నరసాపురం స్థానాలలో కొంత పోటీని ఇవ్వగలిగింది. అంటే రాష్ట్రం మొత్తంమీద 175 నియోజకవర్గాలకుగాను, కేవలం ఐదు స్థానాలలో మాత్రమే ప్రభావం చూపగలిగింది.

జనసేన వైఫల్యానికి కారణాలు
 • జనసేన పార్టీ ఆవిర్భావం నాటి నుండి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు అసమగ్రంగానూ, అయోమయంతో కూడినవిగాను ఉంటూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక స్థిరమైన రాజకీయ పంథాను రూపొందించుకోలేకపోయారు. 
 • జనసేన ప్రధానంగా తమ అధినేతకు ఉన్న జనాకర్షణ మరియు అభిమానుల ఓట్లను మాత్రమే నమ్ముకుని ఎన్నికల బరిలో దిగింది. ఇవి మాత్రమే విజయానికి సరిపోవు. పార్టీకి పటిష్టమైన సంస్థాగత నిర్మాణం ఉండాలి. పవన్ కళ్యాణ్ ఏనాడు దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు.  
 • 2014 ఎన్నికలలో అధికారం తమ లక్ష్యం కాదని, కేవలం ప్రశ్నించడం కోసమేనని తెలిపిన అధినేత పార్టీలో గందరగోళానికి  తెరతీసారు. ఆయన, ఆ ఎన్నికలలో టిడిపి-బిజెపిల కూటమికి మద్దతునిచ్చారు. ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే లక్ష్యంగా ఉండాలి, లేకపోతే అది మనుగడ సాగించలేదు. ఇప్పుడు కాకుంటే మరి కొన్నేళ్లకైనా అధికారాన్ని హస్తగతం చేసుకుంటామనే భావన శ్రేణులకు కలిగించాలి. 
 • టిడిపి-బిజెపిలు అధికారంలోకి వచ్చిన తరువాత పార్ట్-టైమ్ రాజకీయ నేతలా వ్యవహరించారు. ఎప్పుడో ఒకసారి ప్రజల ముందుకు వచ్చేవారు. ఉద్ధానం, అమరావతిలపై స్పందించి ఆ తరువాత వాటిని వదిలివేసారు. నిరంతరంగా ప్రశ్నించడంగాని, సమస్యలపై పోరాడటం కాని చేయలేకపోయారు. ఏనాడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవరించలేకపోయారు. 
 • పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగాలలో అధికార పక్షం కన్నా ఎక్కువగా ప్రతిపక్ష నేతను విమర్శించేవారు. ఇది ప్రజలలో జనసేన, టిడిపిలు ఒకటే అన్న భావనను కలిగించింది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉన్న పరిస్థితులలో ఇది జనసేనకు తీవ్ర నష్టాన్ని కలిగించింది.      
 • పార్టీ ఎన్నికలకు కూడా సరిగ్గా సన్నద్ధం కాలేకపోయింది. అంతరించిపోయే దశలో ఉన్న వామ పక్షాలు, ఉనికే లేని బిఎస్‌పిలతో పొత్తు పెట్టుకోవటం కూడా నష్టంగా పరిణమించింది.
 • పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు. పార్టీపైగాని, వారి నాయకుడిపై గాని చిన్న విమర్శను కూడా తట్టుకోరు. రాజకీయాలలో విమర్శలు సహజం. అందరిపై సోషల్ మీడియాలో పరుష పదజాలాన్ని ఉపయోగించటం తటస్థులను పార్టీ వైపుగా ఆకర్షించడానికి అడ్డుగా నిలిచింది. 
భవిష్యత్ అవకాశాలు ఎలా వుండనున్నాయి? 

అదృష్టవశాత్తు తెలుగు దేశం పార్టీ కూడా ఈ ఎన్నికలలో భారీ వైఫల్యాన్ని చవిచూసింది. ఆ పార్టీ శ్రేణులన్నీ తీవ్ర నిరాశలో ఉన్నాయి. ప్రస్తుత సమయంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజలలో బలాన్ని పెంచుకోవాలి.  

చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే వయసు మీదపడుతున్న దృష్ట్యా, తరువాత తరంలో జగన్, పవన్ మరియు లోకేష్ ల మధ్యే పోటీ ఉండనుంది. ఇది కూడా పవన్ గారికి మరో సువర్ణావకాశాన్ని కల్పించనుంది.   

ప్రజలలో అనుమానాలు 

ప్రజారాజ్యం వైఫల్యం జనసేనను వెంటాడే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీకి ఇరు రాష్ట్రాలలో కలిపి 18% ఓట్లు లభించాయి. ఒక్క యిప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే పరిగణలోకి తీసుకుంటే, ఆ పార్టీ   దాదాపు 25%పైగా ఓట్లు సాధించింది. అయినా ముఖ్యమంత్రి కాకపోవడం వలన పార్టీ నడపడంపై అధినేతకు ఏర్పడిన అనాసక్తితో ఆ పార్టీ రాజకీయాలలో నిలవలేకపోయింది.

ఇప్పుడు జనసేనకు కేవలం 5% ఓట్లు మాత్రమే రావడంతో పవన్ ఏం చేస్తాడో అన్న అనుమానం ప్రజలలో ఉంది. కాబట్టి రాజకీయాలలో స్థిరంగా ఉంటానని నమ్మకం కల్పించాలి.

భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి?
 • పవన్ కళ్యాణ్ గారు పార్టీ సంస్థాగత నిర్మాణంపై  కూడా దృష్టి సారించాలి. ప్రతి గ్రామంలోనూ బూత్ స్థాయి కమిటీలతో సహా, మండల, జిల్లా స్థాయిలలో పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవాలి. బలమైన కార్యకర్తలతో పార్టీ యంత్రాంగం పఠిష్టంగా ఉండాలి.  ప్రతి నియోజకవర్గానికి ఇన్-చార్జ్ ఉండాలి. అవసరమైన చోట కొత్త నాయకులను తయారుచేసుకోవాలి.   
 • పార్ట్-టైమ్ రాజకీయాలు చేస్తారనే భావనను వదిలించుకోవాలి. నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలి. వ్యవస్థలోని లోటుపాట్లను ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలి. సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడాలి. తనకు సమయం ఉన్నప్పుడు లేక ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే సమస్యలను లేవనెత్తి తర్వాత మిన్నకుండిపొతే ప్రజలకు నమ్మకం కలగదు. పార్టీ సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటేనే నిరంతర పోరాటాన్ని చేయగలరు.
 • అధినేత చేసే భావోద్వేగంతో కూడిన ఆవేశపూరిత ప్రసంగాలలో, అభిమానులు సోషల్ మీడియాలో చేసే పోస్టులలో ఎవరినీ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోకూడదు. విధానపరమైన విమర్శలు మాత్రమే చేయాలి. రాజకీయాలలో సాధ్యమైనంతవరకూ అందరినీ కలుపుకుపోవాలి.
 • ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు, వారి ప్రతి నిర్ణయాన్ని గౌరవించాలి. ఎన్నికల వైఫల్యం తరువాత పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన బాధ్యతాయుతంగా, హుందాగా ఉంది. కానీ పవన్/జనసేన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ప్రజలు అమ్ముడుపోయారని, వారంటే అసహ్యం కలుగుతున్నదని, తెలివిలేని వారని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అది పార్టీ భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి సంయమనం పాటించి అందరితో మమేకమవ్వాలి. 

0/Post a Comment/Comments