తమకు ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే కేంద్రంలో మద్ధతు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రకటించారు. కానీ, ప్రత్యేక హోదాకు బదులు దానికి సమానమైన ప్యాకేజీని ఇప్పటికే ఇచ్చామని చెప్పిన బిజెపి, కేంద్రంలో సొంతంగా మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు వారికి ఎవరి మద్ధతు అవసరం లేకపోవటంతో హోదాని సాధించే అవకాశాలు క్లిష్టమయ్యాయి.
ఈ నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ వ్యూహాత్మకంగా వ్యవరించే అవకాశం ఉంది. జగన్ ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశముంది. ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా కోసం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. కేంద్రం తీర్మానాన్ని పెండింగులోనే ఉంచి ఈ ఐదు సంవత్సరాలు గడిపివేసే అవకాశాలే ఎక్కువ.
ఇప్పటికే బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా పైకి మద్దతు తెలుపుతున్నప్పటికీ, హోదాకు సమానమైన పారిశ్రామిక రాయితీలను తమకు కల్పించిన తర్వాతే మద్దతు ఇస్తామని చెబుతుంది. ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ హోదాను వ్యతిరేకిస్తాయి. అందువల్ల కేంద్రం హోదాపై స్పందించటం కష్టమే. ఇప్పటికిప్పుడు కేంద్రంతో ఘర్షణకు దిగి, ఉద్యమాలు చేపట్టినా కేంద్రం హోదా ఇచ్చే అవకాశం లేదు. దీనివలన రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోవడం, మళ్ళీ మళ్ళీ ఎన్నికలు రావడం తప్పితే వేరే ఉపయోగం ఉండక పోవచ్చు.
అందువలన జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంభించే అవకాశాలు తక్కువే. ఆయన హోదా అంశాన్ని పెండింగులోనే సజీవంగా ఉండేలా చూసుకుంటూ, ఇతరత్రా కేంద్రం నుండి రావలసినవి రాబట్టే ప్రయత్నం చేయవచ్చు.
తెలంగాణ ఉద్యమం తరహాలో కేంద్రంలో మనకు అనుకూలమైన సమయం వచ్చేవరకూ ఈ అంశాన్ని గురించి అవసరమైన మేరకు డిమాండ్ చేస్తూ, ఎన్ని ఏళ్లయినా సజీవంగా ఉంచి, వేచి చూడవలసిందే.
Post a Comment