ఆంధ్ర ఆక్టోపస్ కాదు... డ్రాక్యులా

లగడపాటి రాజగోపాల్, తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని పేరు. లాంకో అధినేత అయిన రాజగోపాల్,  మాజీ కేంద్రమంత్రి ఉపేంద్ర చలవతో  కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అయి, సమైక్య ఉద్యమ నేతగా పేరు సంపాదించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరమయ్యాడు. రాజకీయ సన్యాసిని అని చెబుతూనే, వాటిపై ఆసక్తి చావక సర్వేల పేరుతో సెఫాలజిస్టు అవతారమెత్తాడు. 

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఈయన సర్వేలపై కొంతవరకు విశ్వసనీయత ఉండేది. కానీ ఆ ఎన్నికల అంచనాలు పూర్తిగా తప్పడంతో విమర్శలు వెల్లువెత్తాయి. తరువాత కొన్నాళ్ళు మౌనంగా ఉన్న ఆయన మళ్ళీ సర్వే పేరుతో ఈ సార్వత్రిక ఎన్నికల తరువాత బయటకు వచ్చాడు. కానీ, అది కూడా ఘోరంగా విఫలమైంది. అయితే ఈ సర్వే విఫలమైతే భవిష్యత్తులో మళ్ళీ సర్వేలు జరపనని హామీ ఇచ్చాడు. ఈ మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. 

కాగా, ఆయన సర్వేల వెనుక వేరే ఉద్దేశ్యాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. చంద్రబాబు నాయుడు అభిమతం మేరకే ఆయన అసలు సర్వే చేయకుండా, ఈ విధంగా అంచనాలు వెల్లడించినట్లు వాదనలు ఉన్నాయి. ఈ సర్వేలు నమ్మి వేలాది మంది కోట్లాది రూపాయలు బెట్టింగ్ మార్కెట్లో నష్టపోయారని వార్తలు వచ్చాయి. వీటి ద్వారా రాజగోపాల్ కోట్లాది రూపాయలు లాభపడ్డారని, ఆయన ఆక్టోపస్ కాదు రక్తం పీల్చే జలగ అనీ, డ్రాక్యులా అని కూడా  తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీని తమదిగా భావించి అభిమానించే ఒక సామాజిక వర్గం ఉంది. వారిలో కొంతమందికి ఈ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందంటే ఆ పార్టీకి గాని, దాని అధినేతకు గాని  వ్యతిరేకంగా ఏదైనా నిజం చెప్పినా నమ్మరు. పైగా అలా చెప్పిన వారిని తిట్టడమే కాకుండా  గుడ్డిగా ద్వేషిస్తారు. వీరికి తగినట్లుగా వారికి అనుకూలంగా ఉన్న పత్రికలు వ్యతిరేక వార్తలను కూడా అనుకూలంగా మార్చి ప్రచురిస్తుంటాయి. ఆయన సర్వేలు నమ్మి నష్టపోయిన వారిలో ప్రధానంగా తెలుగు దేశాన్ని ఈ విధంగా నమ్మినవారే ఉన్నట్లు సోషల్ మీడియా ఉవాచ.      

0/Post a Comment/Comments

Previous Post Next Post