తెలంగాణాలో 'చే'జారిన అవకాశం

రెండవసారి విజయం సాధించిన అనంతరం టిఆర్ఎస్ అధినేతలో అతి విశ్వాసం నెలకొంది.  తాను ఎంత ఒంటెత్తు పోకడలు ప్రదర్శించినా ప్రజలు సమర్థిస్తారన్న భావనతో ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించడం, మంత్రివర్గ ఏర్పాటులో ఆలస్యంచేయడం వంటి విధానాలను అనుసరించారు. కేవలం తన పరపతితో గెలవగలరనే నమ్మకంతో లోక్ సభ ఎన్నికలలో ప్రజాదరణ ఉన్న నేతలను కాకుండా అనామకులను, నేతల వారసులను పోటీలో నిలిపారు. 

ఇటువంటి చర్యల వలన ప్రజలలో ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి సువర్ణావకాశాన్ని అందించింది. కానీ నాయకుల వలసలు,  అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయంతో శ్రేణులలో నెలకొన్న నైరాశ్యంతో కాంగ్రెస్, ఈ ఎన్నికలకు సరిగ్గా సంసిద్ధం కాలేకపోయింది. కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎలాగూ ఓడిపోతామనే భావనతో అనాసక్తిని ప్రదర్శించటం, బిజెపికి మద్దతునివ్వటం వంటివి కూడా చేసారు. 

అప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం చొరవ చూపి కొన్ని స్థానాలలో బలమైన అభ్యర్థులను నిలపడం వలన  మూడు స్థానాలలో విజయం సాధించడమే కాకుండా మరో మూడు స్థానాలలో బలమైన పోటీని ఇవ్వగలిగింది. కాంగ్రెస్ బలమైన పోటీని ఇవ్వని చోట, ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా సొమ్ముచేసుకున్న బిజెపి నాలుగు స్థానాలను సాధించగలిగింది.  అదే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సంసిద్ధమై బలమైన అభ్యర్థులను నిలబెట్టి ఉంటే మరిన్ని స్థానాలలో విజయం సాధించి ఉండేది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post