చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ప్రముఖ నటి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని రోజా, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌పై 2630 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014లో కూడా ఆమె కేవలం 858 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై విజయం సాధించారు. 2004, 2009లలో టీడీపీ అభ్యర్థినిగా ఆమె చంద్రగిరిలో ఒకసారి, నగరిలో మరోసారి ఓటమి చవిచూసారు.
విజయం సాధించిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను గెలిస్తే పార్టీకి సీఎం పదవి దక్కదనేది తప్పుడు అభిప్రాయమని, టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు తనపై దుష్ప్రచారం చేసారని ఆమె మండిపడ్డారు. తనది ఐరన్ లెగ్ కాదని, గోల్డెన్ లెగ్ అనీ, అలా ప్రచారం చేసినవారందరికీ ఇది చెంప పెట్టు లాంటి తీర్పు అని వ్యాఖ్యానించారు. టిడిపి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, తనను అనవసరంగా అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన తరువాత, 2014లో ఎమ్మెల్యేగా గెలువలేదనే విమర్శలకు చెక్ పెట్టిన రోజా, ఇప్పుడు (2019లో) ఐరన్ లెగ్ అనే విమర్శలను కూడా తిప్పికొట్టినట్లయింది. కాగా, ఆమెకు మంత్రి పదవి కూడా దక్కనుందనే ప్రచారం జరుగుతోంది.
Post a Comment