ఆవిర్భావం నుండి ప్రతి ఎన్నికలలో ఎదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే తెలుగు దేశం పార్టీ, తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగి దారుణమైన పరాభవాన్ని చవిచూసింది. తెలంగాణలో మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు రెండవసారి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు, మన రాష్ట్రంలో దానికి విరుద్ధమైన తీర్పునిచ్చారు. ఇక్కడ ఇంతగా ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం కావడానికి గల కారణాలను ఒకసారి విశ్లేషిద్దాం.
- విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి జరిగిన ఎన్నికలలో టిడిపి, వైసిపిలు తలపడ్డాయి. ఈ సందర్భంగా అప్పటికే పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నో అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో ఎక్కువ శాతం హామీలను నెరవేర్చలేకపోగా, కొన్నింటిని మాత్రం పాక్షికంగా నెరవేర్చగలిగింది. దానితో ఈ సారి కూడా వారు హామీలను నెరవేస్తారనే విశ్వాసం ప్రజలకు లేకపోయింది.
- ఈ హామీలలో రైతుల రుణమాఫీ ప్రధానమైనది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ హామీని పాక్షికంగా నెరవేర్చటానికి ప్రభుత్వం ప్రయత్నించింది కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఆ పాక్షికం కూడా అసంపూర్ణంగా మిగలడంతో ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
- తెలుగు దేశం మ్యానిఫెస్టోలో మరో ముఖ్యమైన హామీ, డ్వాక్రా ఋణ మాఫీ. దీనిని నెరవేర్చడానికి ప్రభుత్వం అసలు ప్రయత్నించలేదు. వడ్డీ మాఫీ, ఆర్థిక సహాయం లాంటి ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ఖజానా సహకరించకపోవటంతో చేతులెత్తేశారు. దీనితో చివరిలో ప్రభుత్వం ఈ వర్గాన్ని పసుపు - కుంకుమ పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయింది.
- 2014 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తాను హైదరాబాద్‌ను నిర్మించానని, ఆంధ్రప్రదేశ్‌కు దానిని మించిన అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించి ఇస్తానని అందమైన కలలను చూపించారు. కానీ ఈ పాలనా కాలంలో అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభించలేకపోయారు. నిర్మాణ ప్రణాళిక రూపొందించటానికే సమయం సరిపోయింది. తాత్కాలిక సచివాలయం, మరికొన్ని భవనాలు నిర్మించినా, వాటిలో నాణ్యతా లోపాలు, అవినీతి ఆరోపణలు ప్రజలను నిరాశపరచాయి.
- రాజధాని ప్రాంతంలో పరిపాలనా అవసరాలకే కాకుండా వాణిజ్య అవసరాల పేరిట భారీగా భూమిని సేకరించారు. సేకరణకు సహకరించని వారిపై దౌర్జన్యం జరిపినట్లు, ఇలా సేకరించిన భూమిని తమ అనుయాయులకు తక్కువ ధరలకు కేటాయించినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాకుండా భూమి సేకరించిన సమయంలో ఇచ్చిన హామీలకు తగిన అభివృద్ధి అక్కడ జరగలేదు. ఇది ఆ ప్రాంత రైతులలో అసంతృప్తికి కారణమైంది.
- రాజధాని ప్రాంతంలో మహాద్భుతాలేవో జరుగుతున్నట్లు ప్రభుత్వం మరియు కొన్ని పత్రికలు చేసిన అతిప్రచారం వలన అక్కడ రియల్ ఎస్టేట్ ధరలు, జీవన వ్యయం విపరీతంగా పెరిగి, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రచారంలో ఉన్న అభివృద్ధి వాస్తవంలో లేకపోవటం వలన ధరల్లో వచ్చిన తీవ్ర హెచ్చు తగ్గులు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా కుదేలు చేసాయి. రాజధాని ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుందనే ప్రచారం వలన తమ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులకు వచ్చింది.
- కేంద్రం పూర్తి చేస్తామనే హామీ ఇచ్చిన పోలవరం ప్రాజెక్టును, త్వరగా పూర్తి చేస్తామనే మిషతో తమ చేతుల్లోకి తీసుకున్న రాష్ట్రప్రభుత్వం నిర్ణీత కాలంలో పూర్తి చేయలేకపోయింది. ముడుపుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందనే వాదన ప్రజలలోకి బలంగా వెళ్ళింది. పైగా కేంద్రంపై ఆరోపణలు, ప్రచార యావతో ప్రతివారం జరిపిన రివ్యూలు, సందర్శన పేరిట చేసిన దుబారా వ్యయాలు అసహనాన్ని కలిగించాయి.
- ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని మంత్రి నారాయణ, కుటుంబరావు వంటి కోటరీపై ఆధారపడి ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడం కూడా కలసి రాలేదు. ప్రభుత్వ విధానాలను ప్రధానంగా లోకేష్ తోపాటు వీరిద్దరే ప్రభావితం చేసి ముఖ్యమంత్రిని ప్రజలకు దూరంచేసి వ్యాపారులకు, దళారులకు లబ్దిని కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి.
- తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇసుక తవ్వకాలు, బదిలీలు, కాంట్రాక్టులలో విపరీతమైన జోక్యం చేసుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి వారిని ఏమాత్రం కట్టడి చేయలేదు. వారు ప్రజలపై, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు కూడా చేయటంతో వాటికి విపరీతమైన ప్రచారం లభించింది. ఇసుక అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయంటే చివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100కోట్ల జరిమానా విధించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏకంగా ముఖ్యమంత్రే ఓటుకు నోటు కేసులో అవినీతి పరుడుగా ముద్రవేసుకున్నారు.
- ఇక గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరిట దేశం శ్రేణులు సమాంతర పాలనా వ్యవస్థగా రూపుదిద్దుకున్నాయి. అన్ని సంక్షేమ పథకాలలో వీరి మాటే చెల్లుబాటుకావటం మెజారిటీ వర్గాలకు కోపకారణమయింది.
- అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడిగారిలో అసహనం తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతపై ఎవరు మాట్లాడినా వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. వాస్తవాన్ని తెలియజేయబోయిన మంత్రులు, అధికారులు, పార్టీ శ్రేణులు ఇలా ఆయన కోపానికి గురయ్యారు. తన దగ్గర నివేదికలు ఉన్నాయని, ప్రజలలో సంతృప్త స్థాయి ఉందంటూ భ్రమల్లో ఉండేవారు. వారు చెప్పేది వినిపించుకోకుండా, సమీక్షల పేరిట చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతూ అధికారులను, మంత్రులను, ఉద్యోగులను రోజుల తరబడి విసిగించడం అలవాటు చేసుకున్నారు.
- నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకెజీతోనే అభివృద్ధి జరుగుతుందని బుకాయించి, ఎన్నికలకు ఆరు నెలల ముందు యు-టర్న్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం, రాజీనాలు చేయడం లాంటి విషయాలలో పదే పదే మాటలు మార్చి విశ్వసనీయతను కోల్పోయారు.
- ప్రతిపక్షనేతపై అసందర్భమైన, వాస్తవ దూరమైన ఆరోపణలు చేసి, మొత్తం మంత్రులంతా ఆయనపై విరుచుకుపడేవారు. తాత్కాలిక అసెంబ్లీ లీక్, రైలు దగ్ధం, ఎయిర్ పోర్టులో హత్యాయత్నం, వివేకా హత్య లాంటి విషయాలలో చేసిన ఆరోపణలలో అధికారంలో ఉన్నపార్టీ ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయింది. ఇది ప్రతిపక్షనేతపై కొంత సానుభూతికి కారణమైంది.
- అధికారంలో ఉన్నవాళ్లు పరిపాలించాలి. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు పోరాటాలు, దీక్షలు చేయాలి. కానీ అధికారంలో ఉండి ధర్మపోరాట దీక్షలు, ఉద్యమాలు చేయడం ప్రజలకు రుచించలేదు.
- "తమ ప్రాంత సమస్యలపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారిస్తారు." అనే ఉద్దేశ్యంతో ప్రజలు జాతీయ పార్టీకి కాకుండా, ప్రాంతీయ పార్టీకి ఓటు వేస్తారు. జాతీయ రాజకీయాలలో పరిణామాలను తమ ప్రాంత లబ్ధికి ఉపయోగించుకోవటాన్ని ప్రజలు హర్షిస్తారు. కానీ, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతాను లాంటి మాటలు ప్రాంతీయ పార్టీ నేతలు మాట్లాడటాన్ని ప్రజలు అంగీకరించరు.
- తెలుగుదేశం పార్టీ భారీగా ఇతరపార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవటంతో ప్రజలలో కొంత వ్యతిరేకత వ్యక్తంకావడమే కాకుండా, పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. పైగా ఈ ఎన్నికలలో మోడీ, పవన్ లాంటి మిత్రులను కోల్పోవడంతో కొంత ఓటు బ్యాంకుకు నష్టం జరిగింది. ఇవే కాకుండా ఉద్యోగాల కల్పన, రిజర్వేషన్లు, కులాలవారీ ప్రత్యేక కేటాయింపులు వంటి నెరవేర్చని హామీలు, పుష్కరాలలో తొక్కిసలాట లాంటివి ఎన్నెన్నో. ఇలా అనేకానేక కారణాలు తెలుగుదేశం పార్టీ ఓటమికి దోహదం చేసాయి.
Post a Comment