దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి గాలికి, స్థానిక పరిస్థితులు తోడవడంతో తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అనూహ్యంగా నాలుగు స్థానాలను సాధించగలిగింది. ఇక్కడ టిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత, ఆ పార్టీ అధినేత అతి విశ్వాసం మరియు స్వయంకృతాపరాధాలు, కాంగ్రెస్ పార్టీ అలసత్వం, మరికొన్ని నియోజకవర్గ పరిస్థితులు తోడవడం బిజెపికి కలిసి వచ్చింది.
తెలంగాణ అధినేత కెసిఆర్ అనుసరించిన విధానాలు బిజెపి ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాయి. మజ్లిస్ పార్టీని అవసరమైన దానికన్నా ఎక్కువగా భుజాన వేసుకోవడం, కరీంనగర్ బహిరంగ సభలో హిందువులు, బొందువులు అని వ్యాఖ్యానించడం కొంతవరకు హిందూ ఓటు ఏకీకృతం కావటానికి కారణమయ్యాయి. ఆయన రెండవ సారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తరువాత అనుసరించిన అహంకారపూరిత విధానాలు ప్రభుత్వ వ్యతిరేకతను కలిగించి, ఇక్కడ ప్రతిపక్షం అవసరమనే భావనను ప్రజలలో కలిగించాయి. ఎంపీ అభ్యర్థులను సమర్థత ప్రాతిపదికన కాకుండా విధేయత, డబ్బు, వారసత్వం ఆధారంగా ఎంపిక చేసుకొని ఓటమికి బాటలు వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితులను ఉపయోగించుకోకపోవటంతో బిజెపి పూర్తిస్థాయిలో లాభపడింది.
- కరీంనగర్ స్థానంలో ప్రజలలో వినోద్ పై పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉండగా, బిజెపి అభ్యర్థి బండి సంజయ్ పై ప్రజలలో సానుభూతి ఉంది. ఈ ప్రాంతంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు, పొన్నం ప్రభాకర్ నిరాసక్తత కలిసి రావడంతో ఆయన భారీ విజయం సాధించారు.
- నిజామాబాద్ స్థానంలో గెలిచిన ధర్మపురి అరవింద్ కు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ లోపాయికారీగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ రైతు సమస్యలు, డిఎస్ పై ఉన్న సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి వచ్చాయని అంచనాలున్నాయి.
- ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నుండి వలస వచ్చిన సోయం బాపూరావు విజయం సాధించారు. ఇక్కడ మరాఠీ ప్రభావం గల నాలుగు మండలాలతో పాటు, మోడీ వేవ్, లంబాడి-గోండు తెగల మధ్య పొరపొచ్చాలు ఆయనకు లాభించాయి.
- సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడని ప్రచారం కావడం, టిఆర్ఎస్ అభ్యర్థి వ్యవహార శైలి బాగాలేకపోవటం, తొలినుండి ఈ స్థానంలో కొంత బలం ఉండటం బిజెపికి కలిసొచ్చాయి.
Post a Comment