కారు - సారు - పదహారు నినాదంతో తెలంగాణా లోక్ సభ ఎన్నికలకు వెళ్లిన టిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలు, ఇంత తొందరగా మనసు మార్చుకొని కొంతవరకు వ్యతిరేకతను వ్యక్తం చేయటానికి గల కారణాలను ఒకసారి విశ్లేషిస్తే....
అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత వినయంతో స్వీకరిస్తాం, అభివృద్ధికి పునరంకితం అవుతాం అని కెసిఆర్ గారు వ్యాఖ్యానించారు. కానీ ఆయన ప్రవర్తన ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా లేదు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటానికి నెలల తరబడి సమయం తీసుకోవటం, ఎప్పుడు ఏర్పాటు చేస్తారో కూడా ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకపోవటం వంటివి ఆయన చేసారు. అంతేకాకుండా మంత్రివర్గ కూర్పు కూడా సరిగ్గా లేదనే సంకేతాలు ప్రజలలోకి వెళ్లాయి. ఎన్నో కళాశాలలు ఉన్న వ్యక్తిని మంత్రి వర్గంలోకి తీసుకుని ఆయనకు ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ లాంటి శాఖలు కట్టబెట్టారు. ముందు నుండి పార్టీకోసం కష్టపడిన వారిని, గత మంత్రివర్గంలో సమర్థంగా పనిచేసిన వారిని పక్కన పెట్టి మరీ ఇలాంటి వారిని ఆయన ప్రోత్సహించారు. 88 స్థానాలు గెలిచిన తరువాత ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించటానికి ప్రయత్నించటం కూడా ప్రజలకు రుచించలేదు.
"తమ ప్రాంత సమస్యలపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారిస్తారు." అనే ఉద్దేశ్యంతో ప్రజలు జాతీయ పార్టీకి కాకుండా, ప్రాంతీయ పార్టీకి ఓటు వేస్తారు. జాతీయ రాజకీయాలలో పరిణామాలను తమ ప్రాంత లబ్ధికి ఉపయోగించుకోవటాన్ని ప్రజలు హర్షిస్తారు. కానీ, జాతీయ రాజకీయాలలో ప్రవేశించి వాటిని సమూలంగా మార్చివేస్తాను లాంటి మాటలు ప్రాంతీయ పార్టీ నేతలు మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు.
టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మానేజ్‌మెంట్, ప్రచార విషయాలలో కూడా అనేక తప్పులు దొర్లాయి. కొన్ని చోట్ల సీట్లను డబ్బుల కోసం అమ్ముకున్నారన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు విజయవంతంగా ప్రజలలోకి తీసుకెళ్లగలిగారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కెసిఆర్ గారు చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి మరీ ఆయన హిందువులకు వ్యతిరేకం అని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఉత్తర తెలంగాణాలో టిఆర్ఎస్ అవకాశాలను కొంతవరకు దెబ్బతీసింది.
శాసనసభ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. శాసన సభ ఎన్నికలను రాష్ట్ర, స్థానిక సమస్యలు ప్రభావితం చేస్తాయి. అదే లోక్ సభ ఎన్నికలలో స్థానిక విషయాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ విషయాలు కూడా ప్రధానపాత్ర వహిస్తాయి. అందువల్ల బీజేపి, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ప్రభావం చూపగలిగాయి.
Post a Comment