ముఖ్యమంత్రిగా తొలి ప్రసంగం - సంతకం - కార్యాచరణ

ప్రమాణ స్వీకారం అనంతరం అభిమానుల కోలాహలం మధ్య ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించారు.  ఇందులో భాగంగా ఆయన ముందుగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేసారు. ఇక్కడికి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, ఇతర నేతలకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు 
  • పాదయాత్ర సందర్భంగా అందరి బాధలు చూసానని, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కేవలం రెండు పేజీల మేనిఫెస్టో తెచ్చానని, దానిని ఒక ఖురాన్‌లా, బైబిల్‌లా, ప్రతి అంశం ఒక భగవద్గీతలా భావించి అమలు పరుస్తానని జగన్ అన్నారు. గత పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలు, పుస్తకాలకు పుస్తకాలు, ప్రతి కులానికీ ఒక పేజీ పెట్టి ఎన్నికల తరువాత చెత్తబుట్టలో పడే మ్యానిఫెస్టోను తాను తీసుకురాలేదని అంటూ హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు.
  • ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్‌ను 3000కు పెంచుతున్నానని తొలి సంతకం దానిపైనే చేశారు. విడతల వారీగా ఈ ఏడాది రూ 2,250లకు, వచ్చే ఏడాది రూ.2,500లకు, ఆ తర్వాత రూ.2,750లకు, ఆ తర్వాతి ఏడాది రూ.3000లకు పెంచుతానని ఆయన తెలియచేసారు.
  • ఉద్యోగ కల్పనలో భాగంగా నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమిస్తామని జగన్ అన్నారు. వీరికి గౌరవ వేతనంగా నెలకు ఐదువేలు అందిస్తామన్నారు. కాగా, వీళ్ళ విధులు దాదాపుగా జన్మభూమి కమిటీల మాదిరిగానే ఉండే అవకాశాలున్నాయి. కాకపొతే అక్కడ తెలుగు దేశం కార్యకర్తల బదులు ఇక్కడ వైసిపి కార్యకర్తలు ఉంటారు. ఆ కమిటీ సభ్యులకు వేతనం లేకపోవడంతోనే అవినీతి జరిగిందని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి దానిలో గ్రామానికి కనీసం 10 కొత్త ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.      
  • ఆరు నెలలలోపు అవినీతిని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తానని, దీనికోసం ఆగస్టు 15న ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని, అవినీతి జరిగిందని తెలిసినా, ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష జరిగిందని భావించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేయవచ్చునని ఆయన అన్నారు.           
  • గత ప్రభుత్వ టెండర్లను, రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా సమీక్షిస్తామని, ఎక్కడ అవినీతి జరిగినా వాటిని రద్దు చేస్తామని జగన్ తెలిపారు. సోలార్‌ పవర్‌, విండ్ పవర్‌ల టెండర్లలో అవినీతి జరిగిందని వాటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానని కూడా ఆయన తెలిపారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీల తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
ప్రమాణ స్వీకారం, ప్రసంగం ముగిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రక్షాళనలో భాగంగా దానిలోని నలుగురు అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీచేశారు. అలాగే, పర్యాటక శాఖ ఎండీగా పనిచేస్తున్న ధనుంజయ్‌ రెడ్డిని ముఖ్యమంత్రికి అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. 

ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ శాఖలన్నీ నిర్మాణ పనులు నిలిపివేయాలని, మంజూరై ప్రారంభించని పనులు రద్ధు చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసారు. నిధులు, వ్యయం, బిల్లుల మంజూరుపై స్పష్టతనిస్తూ నిబంధనలు వెలువరించారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, అధికారులు ఈ నిబంధనలు ప్రకారమే వ్యవహరించాలని  హెచ్చరించారు.         

0/Post a Comment/Comments

Previous Post Next Post