'టైం మ్యాగజైన్' మోడీపై అభిప్రాయాన్ని మార్చుకుందా?

అంతర్జాతీయ పత్రిక అయిన 'టైం' యు-టర్న్ తీసుకుందని, మోడీ గెలవగానే ఆయనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుందని మనదేశ మీడియాలో కథనాలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ, మన స్థానిక వార్తా పత్రికలలా, అంతర్జాతీయ పత్రికలు కూడా ఎదో ఒక రాజకీయ పార్టీకిగాని, నేతకు గాని అనుకూలంగా వ్యవహరిస్తాయని  భావించలేము. ఆ పత్రికకు మన దేశ నేతపై ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు.

అంతర్జాతీయ వార్తా పత్రికలలో జర్నలిజం విలువలు వేరే విధంగా ఉంటాయి. వారు ప్రచురించిన ప్రతి వ్యాసంలో అది ఎవరు వ్రాసారు?,  వారి దేశం మరియు నేపథ్యం లాంటి వివరాలు కూడా జత చేస్తారు. ఒకే అంశంపై, భిన్న అభిప్రాయాలు గల ఇద్దరు జర్నలిస్టులు రాసిన పరస్పర విరుద్ధంగా కనిపించే వ్యాసాలను  కూడా  అవి ఒకే రోజున ప్రచురించగలవు. వాటిని పత్రిక అభిప్రాయంగా కాకుండా ఆ రచయిత అభిప్రాయంగా మాత్రమే పరిగణించాలి. మన దేశ పత్రికలలో మొదటిపేజీలలో వచ్చే చాలా వరకు వ్యాసాలలో రచయిత, నేపథ్యం వంటి వివరాలు ఉండవు. కాబట్టి వాటిని మనం ఆ పత్రికల అభిప్రాయంగా పరిగణిస్తాము. 

ఇక టైం పత్రికలో కొన్ని రోజుల క్రితం వచ్చిన "Divider in Chief" వ్యాసం, పాకిస్థాని వ్యాపారి సల్మాన్ తసీర్ రాసినది. ఒక పాకిస్తానీ ముస్లింగా, ఆయనకు అతివాద హిందుత్వవాది అయిన మోడీపై వ్యతిరేక భావం ఉండి ఉండవచ్చు. అందుకే మోడీ దేశాన్ని మతపరంగా విభజిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

ఇక ఇప్పటి  ఆర్టికల్ "Modi Has United India Like No Prime Minister in Decades" ను ఎన్నికల ఫలితాల అనంతరం భారతీయ జర్నలిస్టు మనోజ్ లాద్వా రాసారు. ఆయన అభిప్రాయం ప్రకారం "గత కొన్ని దశాబ్దాలలో మన దేశంలో ఏ ప్రధాని కూడా దేశవ్యాప్తంగా ఇంత ఆదరణ సంపాదించుకోలేదు. ఆయన వల్లే దేశంలో అన్ని ప్రాంతాలలో బిజెపి విజయం సాధించింది."  

పరస్పర విరుద్ధంగా కనిపించే ఇద్దరి అభిప్రాయాలను ప్రచురించటం అనేది, చర్చలో ఇద్దరి వాదనలు వినడం వంటిదే. దీని ఆధారంగా మన ప్రధానిపై ఆ పత్రిక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని గాని, మార్చుకుందని గాని భావించలేము. 

0/Post a Comment/Comments

Previous Post Next Post