కేంద్ర మంత్రిమండలిలో దక్షిణాదికి అన్యాయం

నిన్న ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రిమండలిలో తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక స్థానం, అది కూడా స్వతంత్ర హోదా లేని సహాయ మంత్రిపదవి దక్కింది. గత బిజెపి ప్రభుత్వాలలో వెంకయ్య నాయుడు రూపంలో కనీసం ఒక క్యాబినెట్ స్థానం అయినా దక్కేది. 

తెలంగాణాలో బిజెపికి సొంతంగా నాలుగు స్థానాలున్నాయి. కిషన్ రెడ్డి గారు సమర్థులు, సీనియర్ రాజకీయ నాయకులు, దశాబ్దాలుగా అంటే ఆయన విద్యార్థి దశ నుండి పార్టీనే నమ్ముకుని ఉన్నారు. బిజెపికి జాతీయ స్థాయిలో యువజన విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయనకు కేవలం సహాయ మంత్రి హోదాను ఇవ్వడం ఏమిటి? ఒక వేళ అధిష్ఠానానికి ఆయన సమర్థత పైన అంత నమ్మకం లేకపోతే, మరో ఎంపీకి ఇవ్వాల్సింది లేదా మరొకరికి క్యాబినెట్ పదవిని ఇచ్చి రాజ్య సభకు పంపవలసింది. ఎన్నిసార్లు ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులను, తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభకు పంపలేదు?  

ఇలా నిర్లక్ష్యం చేయడం ద్వారా ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం పంపదలచుకున్నారు? గత హయాంలో కేంద్ర ప్రాజెక్టులలో, కేటాయింపులలో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది. ఇస్తామన్న బయ్యారం స్టీల్ ప్లాంట్, ITIR ప్రాజెక్ట్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వంటివేవీ ఇవ్వలేదు. కాళేశ్వరం జాతీయ హోదాపై కూడా స్పందించలేదు. పైగా 2023లో అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యాన్ని, ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేసారు. క్రితంసారి తెలంగాణకు లేకున్నా, కనీసం తెలుగు రాష్ట్రాల నుండయినా కాబినెట్లో ప్రాతినిధ్యం ఉందన్న భావన ఉండేది.      
ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకకు 4 (2 క్యాబినెట్, 2 సహాయ ), కేరళకు 1 (సహాయ ), గోవాకు 1 (సహాయ ) మంత్రి పదవులు లభించాయి. తమిళనాడుకు కూడా ప్రాతినిధ్యం లేదు. నిర్మలా సీతారామన్ గారినే తమిళనాడు, కర్ణాటక రెండు రాష్ట్రాలలో చూపించాలన్న భావన వారికి ఉండవచ్చు. కానీ, దేశంలో వసూలయ్యే పన్నులు మరియు జిడిపిలో 25-30% పైగా అందించే దక్షిణాది రాష్ట్రాలకు కనీసం 10% ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయం. 
    
దక్షిణాది రాష్ట్రాలకు ఆర్ధిక పరంగా కూడా అన్యాయం జరుగుతుందన్న వాదనలు ఎప్పటినుండో ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో బడ్జెట్లు, ఆ రాష్ట్ర జిడిపిలలో సగం కూడా ఉండవు. కానీ కొన్ని ఉత్తరాది రాష్ట్రాల బడ్జెట్లు, ఆ రాష్ట్రాల జిడిపి కన్నా ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం పన్నులు ఇక్కడ, కేటాయింపులు అక్కడ అన్న విధానమే. అందుకే ఈ రాష్ట్రాలలో క్రమంగా జాతీయ పార్టీలు ప్రాభవం కోల్పోయి,  ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. ఇలాంటి విధానాల వల్లే గతంలో తమిళనాడు నాయకులు ప్రత్యేక దక్షిణాది/ ద్రవిడనాడు  గురించి మాట్లాడారు. కెసిఆర్ గారు కూడా ప్రత్యేక దేశం గురించి మాట్లాడకున్నా, వికేంద్రీకరణ గురించి మాట్లాడారు. రక్షణ, విదేశాంగ విధానం కాకుండా మిగిలిన అన్ని విషయాలలో రాష్ట్రాలకే అధికారం ఉండాలని ఆయన అన్నారు. కర్ణాటక గత ముఖ్యమంత్రి గారు కూడా మా రాష్ట్ర పన్నులపై కేంద్ర పెత్తనమెందుకని నిలదీశారు. కేంద్రం ఈ  రాష్ట్రాలకు ఆర్థికంగా, రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం కల్పించకపోతే, ఇలాంటి ధోరణులు మరింత బలపడే అవకాశముంది.     

0/Post a Comment/Comments

Previous Post Next Post