తెలంగాణాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాలుగు స్థానాలు గెలుచుకోవటంతో బిజెపి శ్రేణులలో ఎన్నడూ లేనంత ఉత్సాహం నెలకొంది. దీనితో దక్షిణాదిన రెండవ రాష్ట్రంలో కూడా వారు అడుగిడినట్లయింది. ఇక్కడ మరింత బలం పుంజుకుని, 2023లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. బిజెపికి ఉన్న హిందీ/ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పార్టీ అనే ముద్రను తొలిగించుకోవాలనే పట్టుదలతో ఉన్న వారు తెలంగాణ రాష్ట్రంపై మరింతగా దృష్టిని కేంద్రీకరించనున్నారు.
బిజెపి రాష్ట్రంలో ఏ విధానాలను అనుసరించనుంది?
- తెలంగాణకు కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించడం, పథకాలలో ప్రాధాన్యత కల్పించటం వంటివి చేయడం ద్వారా ఇక్కడ మద్ధతు పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు.
- మోడీకి ఉన్న ఇమేజ్, అభివృద్ధి, హిందుత్వ, జాతీయవాదం లాంటి వాటిని ఉపయోగించి టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి పెద్ద నేతలను ఆకర్షించే అవకాశముంది. రాజకీయ నేతలుగా మారిన కార్పొరేట్ సంస్థల అధినేతలను ఆకర్షించడం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి సులభమే.
- రాష్ట్రంలో అసంతృప్తితో ఉన్న కొన్ని కులాలను/వర్గాలను తమ వైపు ఆకర్షించడం వంటి, ఉత్తరప్రదేశ్‌లో విజయవంతమైన సోషల్ ఇంజనీరింగ్ విధానాలను ఇక్కడ అమలు చేయవచ్చు.
- తమకు ఉన్న భారీ సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను, అనుభవాన్ని ఉపయోగించి తమ భావజాలాన్ని వ్యాపింపచేయడం, ప్రత్యర్థుల ఇమేజ్‌ను దెబ్బతీయడం ద్వారా బిజెపి బలపడే ప్రయత్నం చేయనుంది. కెసిఆర్ గారు కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలను బిజెపి ఈ విధంగానే ఉపయోగించుకుంది.
తెలంగాణాలో ఈ స్థాయి విజయాన్ని బిజెపి నేతలు కూడా ఊహించలేకపోయారు. హైదరాబాద్ మరియు కొన్ని టైర్-2 పట్టణాలలో తప్ప పార్టీకి క్షేత్రస్థాయిలో బలంగాని, క్యాడర్ గాని లేవు. ఇక్కడ నాలుగు స్థానాలు రావడానికి బిజెపి బలం కన్నా, కెసిఆర్‌పై ఉన్న వ్యతిరేకతే ఎక్కువ పనిచేసిందని చెప్పవచ్చు.
రెండవసారి విజయం సాధించిన తరువాత అహంభావంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, హిందువులపై చేసిన వ్యాఖ్యలు కెసిఆర్‌పై వ్యతిరేకతను పెంచాయి. ఆ స్థానాలలో బలహీనమైన కాంగ్రెస్ అభ్యర్థులు ఉండటం బిజెపికి కలసివచ్చింది. నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలిచినప్పటికీ ఈ పార్టీకి వచ్చిన ఓటింగ్ 19% మాత్రమే. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను మాత్రమే గెలిచినప్పటికీ 29% ఓట్లను సాధించింది. టిఆర్ఎస్ కు ఇప్పటికీ 41% ఓటు బ్యాంకు ఉంది.
కెసిఆర్ గారు, కాంగ్రెస్ ఏం చేయవచ్చు?
గత పాలనా కాలంలో బిజెపి ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా, బయ్యారం స్టీల్ ప్లాంట్, ITIR ప్రాజెక్ట్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వంటి విషయాలలో తెలంగాణకు అన్యాయం చేసినా, నోట్ల రద్దు, జిఎస్టి వంటి విషయాలలో ఇబ్బందిపడినా కెసిఆర్ గారు కేంద్రంపై పెద్దగా ఆరోపణలు చేయలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన, కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే తనకు ప్రత్యర్థిగా భావించారు. ఒకవేళ బిజెపిని విమర్శిస్తే కాంగ్రెస్ బలపడటానికి దోహదం చేసినట్లవుతుందని ఆయన మిన్నకుండి పోయారు. కెసిఆర్ తన వ్యూహాలను సమీక్షించుకుని, బిజెపిపైన కూడా దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంది.
ఒకవేళ బిజెపి బలపడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో మనుగడ సాధించడం కష్టమే. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా టిఆర్ఎస్ విజయం సాధించినా పరవాలేదు కాని, బిజెపి విజయం సాధించకూడదు అనే భావనలో ఉంటుంది. ఈ సారిలా వారు ఉదాసీనంగా వ్యవరించడం గాని, అంతర్గతంగా సహకారం అందించడంగాని చేయరు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ డిమాండ్లను కేంద్రంలో బలంగా వినిపించడం, క్షేత్ర స్థాయిలో కేంద్రం నుండి రావలసిన వాటి కోసం విమర్శించడం చేయవచ్చు.
ఏం జరగవచ్చు?
కెసిఆర్ వ్యూహ రచనలో నిపుణుడు కావడం, కాంగ్రెస్ కూడా తెలంగాణాలో బలంగా ఉన్న నేపథ్యంలో, తెలంగాణలో అధికారంలోకి రావడం బిజెపికి అంత సులభం కాదు. కనీసం రెండవ స్థానంలో నిలవాలన్నా ఏదైనా అద్భుతం జరగాలి. మోడీ, షాలకు అద్భుతాలు చేసే సామర్థ్యం ఉంది.
Post a Comment