ప్రవాసులు పంపే నగదు మనదేశానికే అత్యధికం

ప్రవాస భారతీయులు పంపే నగదు 80 బిలియన్ డాలర్లకు చేరనుండటంతో, ఈ సంవత్సరం కూడా మన దేశం ఈ విషయంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోనుందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలియచేసింది. తరువాత స్థానాలలో చైనా (67 బిలియన్ డాలర్లు), మెక్సికో, ఫిలిప్పీన్స్ (రెండు దేశాలు సమానంగా 34 బిలియన్ డాలర్లు), ఈజిప్టు (26 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. 

మన దేశానికి ప్రవాస నిధుల ప్రవాహంలో గత మూడు సంవత్సరాలుగా చెప్పుకోదగ్గ వృద్ధి కనిపిస్తోంది. 2016లో 62.7 బిలియన్ డాలర్లు ఉండగా, 2017 నాటికి 65.3 బిలియన్ డాలర్లకు చేరాయి. గత సంవత్సరం ఇది మన జీడీపీలో 2.7 శాతం. మన దేశ ద్రవ్యలోటును పూడ్చుకోవటానికి ఈ నిధులు ఎంతగానో దోహదపడుతున్నాయి. మన దేశానికి గల్ఫ్ దేశాలనుండి వచ్చే మొత్తం, యురోపియన్, అమెరికాల నుండి వచ్చే మొత్తాల కన్నా ఎక్కువగా ఉండటం విశేషం.           

ఈ యేడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు జరుగుతున్న చెల్లింపులు 10.8% పెరిగి 528 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. 2017లో ఇవి 7.8% వృద్ధి చెందాయి. దక్షిణ ఆసియాకు వస్తున్న నగదు 2018లో 13.5% పెరిగి 132 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2017లో వృద్ధి 5.7% మాత్రమే. చమురు ధరలు పెరిగి గల్ఫ్ దేశాల ఆర్ధిక పరిస్థితులు మెరుగవటంతో  గత మూడు సంవత్సరాలుగా దక్షిణాసియాలో ఈ పెరుగుదల కనిపిస్తోంది. బంగ్లాదేశ్ లో వృద్ధి ఈ సంవత్సరం 17.9% ఉండగా, పాకిస్తాన్ విషయంలో 6.2% ఉంది. మూడు సంవత్సరాల క్రితం వరకు పాకిస్తాన్ కు వచ్చే నిధులు కొన్ని సంవత్సరాల పాటు వరుసగా తగ్గాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post