హైదరాబాద్‌ను నిర్మించిందెవరు?

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కెసిఆర్ "హైదరాబాద్‌ను నిర్మించిందెవరు? చంద్రబాబు నిర్మిస్తే మరి కులీ కుతుబ్ షా ఏం చేసాడు?" అంటూ తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ఆయన వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. తానెప్పుడూ హైదరాబాద్‌ను నిర్మించానని చెప్పలేదని, కానీ తానే సైబరాబాద్ నగరాన్ని నిర్మించానని శంషాబాద్ ఎయిర్‌పోర్టు మరియు ఔటర్ రింగురోడ్డు కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రూపుదిద్దుకున్నాయని కొత్త పల్లవిని అందుకున్నాడు. ఈ వాదనలలో ఉన్న వాస్తవాలను ఒకసారి సమీక్షించుకుందాము. 

హైదరాబాద్‌లో ఐటీ రంగం ఎలా ప్రారంభమైంది అని ఒకసారి పరిశీలిస్తే 
  • ఈసీఐఎల్, డీఈఆర్‌ఎల్ సంస్థలు అరవైవ దశకంలో ఏర్పాటు అవటంతో హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాది పడింది. 
  • 1982లో కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ) సంస్థ ఇక్కడ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఇప్పుడు టిసిఎస్ సంస్థలో భాగంగా మారింది.  
  • అప్పట్లో చంద్రబాబు తన ఘనతగా చెప్పుకున్న సత్యం కంప్యూటర్స్ సంస్థ కూడా 1987లోనే నగరంలో ప్రారంభమయింది. 1992లోనే పబ్లిక్ ఇష్యూకి వెళ్లి చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికే పెద్ద సంస్థగా మారింది.  
  • ఇంటర్‌గ్రాఫ్ సంస్థ కూడా అదే సంవత్సరంలో అంటే 1987లోనే హైదరాబాద్‌కు వచ్చింది. 
  • 1992 ప్రాంతంలో ఎస్‌టీపీఐ ఏర్పాటు కావటంతో పదుల సంఖ్యలో బహుళజాతి ఐటీ కంపెనీలు నగరంలో తమ శాఖలను ప్రారంభించాయి.   
ఇక హై-టెక్ సిటీ, సైబరాబాద్ విషయానికి వస్తే 

హై-టెక్ సిటీ నిర్మాణానికి పీవీ నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్న సమయంలోనే బీజం పడింది. ఆయన భారత దేశ అభివృద్ధికి ఐటీ రంగం కీలకమని భావించి దేశంలో ఆరు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు (ఎస్‌టీపీఐలు) ఏర్పాటు చేసారు. వాటిలో తొలి  కేంద్రాన్ని హైదరాబాద్‌కు మంజూరు చేయగా ఇప్పటి మైత్రీవనం(అమీర్‌పేట)లో అది ఏర్పాటు అయింది. అయితే అనేక సంస్థలు వచ్చి ఆ భవనం సరిపోకపోవటంతో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్ ప్రాంతంలో పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇప్పటి సైబర్ టవర్స్ ప్రాంతంలో భవనాల నిర్మాణానికి కూడా 1992లోనే ఏపీఈఎల్ పేరుతో శంకుస్థాపన కూడా చేసారు. 

జనార్దన్ రెడ్డి హయాంలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఈఎల్) ఏర్పాటు జరిగింది. దాదాపు 200 ప్రముఖ కంపెనీలకు ఆయన లేఖలు రాసి, రాష్ట్రం కల్పించే ఐటీ సదుపాయాలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. చంద్రబాబు గారు హైటెక్ సిటీ నిర్మాణం విషయంలో, సైబరాబాద్ విషయంలో పీవీ నరసింహారావు, జనార్దన్ రెడ్డిల కృషిని ఆనవాళ్లు లేకుండా చేసి మీడియా సహాయంతో అంతా తానే చేసినట్లుగా భ్రమలు  కల్పించటంలో సఫలీకృతుడయ్యాడు.  

అసలు చంద్రబాబు నాయుడు గారి హయాములో ఏమి జరిగింది? 

చంద్రబాబు గారు 1995 సెప్టెంబరులో అధికారంలోకి వచ్చాక వ్యూహాత్మకంగా మాదాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలలో తనకు సంబంధించిన వారితో భూములు కొనిపించి, హైటెక్ సిటీ పై భారీ ఎత్తున ప్రచారానికి తెరలేపారు. దానితో హైటెక్ సిటీ అందరి నోళ్ళలో నానటంతో పాటు అక్కడ రియల్ వ్యాపారం ఊపందుకుంది. ఆయన అధికారంలోకి వచ్చిన 1995 నాటికి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ ఎగుమతులలో దేశంలో మూడవ స్థానంలో ఉండగా, 2004 నాటికి ఐదవ స్థానానికి పడిపోయింది. 

శంషాబాద్ విమానాశ్రయానికి ఒప్పందం మాత్రం బాబు హయాంలోనే కుదిరింది. కానీ నిర్మాణం మాత్రం వైఎస్ఆర్ హయాములో జరిగింది. ఈ ఒప్పందంలో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే ఈ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల దూరంలో 25 సంవత్సరాల వరకు మరే విమానాశ్రయం నిర్మించరాదు. వాయు మార్గంలో 150 కిలోమీటర్లు అంటే తెలంగాణాలో ఆదిలాబాద్ జిల్లాలో తప్ప మరెక్కడా కొత్తగా విమానాశ్రయం రాదు. అంటే ప్రైవేటు సంస్థకు గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టాడు.  

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఔటర్ రింగ్ రోడ్ కోసం ప్రణాళిక కూడా ఆమోదం పొందింది. దీని నిర్మాణం కూడా వైఎస్ఆర్ హయాములోనే జరిగింది. అయితే ప్రణాళిక సమయంలో ఈ రింగురోడ్డును ఎన్నిసార్లు మార్చారో, ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయో, ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలుసు. రోడ్డు మార్గాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చినందువలన కోర్టులో దాఖలైన కేసులు ఈ మధ్యకాలం వరకూ కొనసాగాయి.    

90వ దశకంలో ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐటీ అభివృద్ధి జరిగింది. కాలానుగుణంగా వచ్చిన మార్పులను మీడియా సహాయంతో తన ఘనతగా ప్రచారం చేసుకున్నాడు. ఒక్కొక్కసారి మీడియా ఇచ్చిన అత్యుత్సాహంతో కంప్యూటర్‌ను నేనే కనిపెట్టాను, సెల్‌ఫోనును నేనే దేశంలోకి తెచ్చాను లాంటి అతిశయపు మాటలు కూడా మాట్లాడుతుంటారు. ఈ మీడియా మేనేజ్‌మెంట్ ఏ స్థాయిలో జరిగిందంటే ఇప్పటికీ అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా ఆ భ్రమలలోనే ఉన్నారు.    
    
బెంగళూరులో ఐటీ రంగం హైదరాబాద్‌కన్నా ఐదింతలు ఎక్కువగా అభివృద్ధి చెందినా అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రులు దేవెగౌడ, ఎస్ఎం కృష్ణలాంటి వారు ఎప్పుడూ నగరాన్ని నిర్మించాం తరహా అతిశయ ప్రకటనలు చేయలేదు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post