1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధానిగా సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఉప ప్రధాని పదవితో పాటు హోంశాఖ, సమాచార శాఖలను కూడా పటేల్ నిర్వహించారు. ప్రధాని విదేశాంగ, విద్య మరియు సాంకేతిక శాఖలు నిర్వహించారు. ఆ కాలంలో వారిద్దరి మధ్యా విభేదాలు ఏమీ లేకపోయినా గుజరాత్‌లో పటేల్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా వార్తలలో నిలిచారు.
పటేల్ వలననే దేశంలో హైదరాబాద్, జునాగఢ్ వంటి సంస్థానాలు దేశంలో అంతర్భాగంగా మారాయని లేకపోతే దేశం 500 చిన్న చిన్న భాగాలుగా ఉండేదనే వార్తలు, ప్రకటనలు వ్యాప్తిలోకి తెచ్చారు. అసలు స్వాతంత్య్రం వచ్చేనాటికే హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ లాంటి కొన్ని ప్రాంతాలు మినహా మిగతావన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. విభజన అనంతరం ఈ మూడు సంస్థానాలలో హిందువులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్, జునాగఢ్ ప్రాంతాలు మన దేశానికి ఇస్తే ముస్లిములు ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తానుకు ఇవ్వటానికి కూడా పటేల్, నెహ్రూలు సుముఖంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ అంగీకరించలేదు. ఆ తరువాత పోలీసు చర్య పేరుతో సైన్యం ద్వారా హైదరాబాద్, జునాగఢ్‌లు మన దేశంలో భాగమయ్యాయి. తరువాత అదే తరహాలో జమ్ము-కాశ్మీర్ ను ఆక్రమించటానికి పాకిస్తాన్ ప్రయత్నించటంతో ఆ వివాదం ఇప్పటికీ రగులుతూనే ఉంది. అయితే ఆ సమయంలో పటేల్, నెహ్రూలిద్దరూ సమన్వయంతోనే వ్యవహరించారు. ప్రధానిని పక్కన పెట్టి పటేల్ మాత్రమే ఒంటరిగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ఎక్కడా కనిపించలేదు. నెహ్రూ స్వభావ రీత్యా మృదువుగా, పటేల్ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించేవారు. బహుశా అలా వ్యవహరించటం కూడా గుడ్ కాప్/ బ్యాడ్ కాప్ తరహా వ్యూహం కావచ్చు. నెహ్రూ విదేశాంగ శాఖను నిర్వహిస్తుండటంతో ప్రపంచ దేశాల దృష్టిలో మన దేశం దురాక్రమణలకు పాల్పడుతోంది అని భావింపకుండా చేయటం కోసం కూడా కావచ్చు.
పటేల్ 1950లో మరణించగా, నెహ్రూ 1964 వరకూ దేశ ప్రధానిగా పని చేసారు. ఆయన గొప్ప దార్శనికుడు. మానవతావాది. మనదేశం విద్య, పారిశ్రామిక మరియు సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందటానికి బాటలు వేసింది ఆయనే.
మన దేశ ఆర్ధిక వ్యవస్థ పెట్టుబడిదారీ మరియు సోషలిస్టు వ్యవస్థల మేలుకలయికగా ఉండాలని నెహ్రూ భావించారు. అందుకే స్టీలు, కాపర్, బొగ్గు, విద్యుత్ రంగాలలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయటంతో పాటు ప్రైవేటు సంస్థలను కూడా ప్రోత్సహించాడు. ఆయన ఎంచుకున్న అలీన విధానం కూడా కోల్డ్ వార్ సమయంలో కూడా అన్ని దేశాలు మన దేశ పారిశ్రామికీకరణలో పాలుపంచుకున్నాయి. వివిధ దేశాల సహకారంతో ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు ఏర్పాటు చేసి విద్యారంగ అభివృద్ధికి కృషి చేసాడు. ఈ రోజు దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, రక్షణ మరియు పరిశోధన సంస్థలు అన్నీ ఆయన హయాంలో స్థాపించినవే. వ్యయసాయ రంగములో కూడా పరిశోధన సంస్థలు, యూనివర్సిటీలు స్థాపించి 1960 తొలి హరిత విప్లవానికి కారణమయ్యాడు.
1952 నుండి 1962 వరకు దేశంలో పారిశ్రామిక వృద్ధి రేటు నాలుగు శాతానికి పైగానే ఉండేది. అదే స్థాయి అభివృద్ధి కొనసాగితే 1990ల నాటికే భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేది. కానీ 1962లో జరిగిన చైనా దండయాత్ర వలన మనదేశం ప్రాథమ్యాలను మార్చుకొనవలసి వచ్చింది. అభివృద్ధి పైనే కాకుండా రక్షణ రంగంపై కూడా దృష్టి సారించవలసి వచ్చింది. 1965, 1971 యుద్ధాల వలన రక్షణ వ్యయం మరింత పెరిగి అభివృద్ధి పూర్తిగా మందగించింది. 1991లో సరళీకరణల తరువాతే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడి అభివృద్ధి బాట పట్టింది.
ఈ విషయాలన్నింటినీ గమనిస్తే మోడీ, బిజెపిలు తమ రాజకీయ అవసరాల కోసం పటేల్, నెహ్రూల మధ్య లేని విభేదాలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తుంది. పటేల్‌కు గుజరాతీ కుటుంబానికి సంబంధించిన పేరు ఉందనే భావనతోనో, లేక నెహ్రూ కుటుంబంపైన ద్వేషంతోనో ఆయన వ్యవహరిస్తున్నట్లున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కానీ వీరిలో ఒకరైన పటేల్‌ను ఈ తరానికి తమ భావజాలానికి చెందిన వ్యక్తిగా పరిచయం చెయ్యాలని మోడీ భావన కావచ్చు. కానీ పటేల్ RSS భావజాలానికి బద్ద వ్యతిరేకి అనే విషయాన్ని మాత్రం మరుగుపరుస్తున్నారు.
పటేల్ విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విగ్రహం సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందని కూడా మోడీగారు వ్యాఖ్యానించారు. చైనాలో తయారైన విగ్రహంలో దేశ సాంకేతికత ఏముందో ఆయనకే తెలియాలి. విగ్రహం వలన దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కూడా వ్యాఖ్యానించారు. పర్యాటక రంగ అభివృద్ధికి గుజరాత్‌నే ఎందుకు ఎన్నుకోవలసి వచ్చింది. పటేల్ భారత దేశంలో కలిపిన హైదరాబాద్లో ఏర్పాటు చేయవచ్చు కదా?
పటేల్ విగ్రహ తయారీకి 2500 కోట్లకు పైగా ఖర్చయింది. అయితే దీనికి కేంద్రం ప్రత్యక్షంగా సహాయం చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆయిల్ కంపెనీల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులను వెచ్చించేలా ఆదేశించింది. అవే ఆయిల్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ రాజధానికి సహాయం చేయమని కోరవచ్చు కదా? పైగా ఈ ఆయిల్ సంస్థలలో కొన్ని రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్లో చమురును ఉత్పత్తి చేస్తున్నాయి.
Post a Comment