టిఆర్ఎస్ ముందస్తు ఆశలు ఫలించేనా?

కెసిఆర్ గారు సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉండగానే విజయంపై నమ్మకంతో ముందస్తుకు వెళ్లారు. ఇలా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో ఆయనకున్న అంచనాలేమిటి? అవి నిజమయ్యే అవకాశాలున్నాయా?

కెసిఆర్ ఇమేజ్ 

ఎవరు అంగీకరించినా, వ్యతిరేకించినా సామాన్య ప్రజానీకంలో తెలంగాణాను సాధించిన ఇమేజ్‌ను కెసిఆర్ గారు ఒక్కరే సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలోనే ఇది రుజువైంది. ఇప్పుడు తెలంగాణాలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఆయనే. రాష్ట్రంలో ఏ ఇతర నాయకుడిని ఈ విషయంలో ఆయనతో పోల్చలేము. 

అభివృద్ధి పథకాలు - నేరుగా నగదు బదిలీ   

ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు కూడా కొన్ని వర్గాలలో ఆయనకు సానుకూల వాతావరణాన్ని కలిగించగలిగాయి. పింఛన్ల పెంపు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు లాంటి వాటితో లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ జరిగింది. వీటితో పాటు ఆయన ప్రవేశ పెట్టిన ఇతర పథకాల లబ్ధిదారులు కూడా ఆయన వైపే మొగ్గే అవకాశం స్పష్టంగా ఉంది. 24 గంటల విద్యుత్  కూడా ఆయనకు కలసి రానుంది.  

కాంగ్రెస్ టిడిపి పొత్తు     

కెసిఆర్ గారికి అవసరమైన సమయంలో తనకు అనుకూలంగా ప్రజలలో భావోద్వేగాలను రగల్చగలిగే సామర్థ్యం ఉంది. ఆర్థిక కారణాల వలననో లేక సెటిలర్ల ఓట్ల కోసమో లేక మరే ఇతర కారణం వలననో కాంగ్రెస్ పార్టీ టిడిపితో పొత్తు కుదుర్చుకుంది. ఇది మరోసారి ఆయనకు అలాంటి వాతావరణాన్ని సృష్టించటానికి ఉపయోగపడింది. అందుకే ప్రచారంలో కూడా కెసిఆర్ గారు ప్రధానంగా చంద్రబాబునే విమర్శిస్తున్నారు.  

హిందూ మతాభిమాని కావటంతో పాటు ముస్లిం ఓట్లు కూడా పొందగలగటం 

హిందూ మతాభిమానిగా ముద్రపడిన కెసిఆర్ గారు మతానికి సంబంధించిన నమ్మకాలను, ఆచారాలను హిందుత్వ పార్టీలుగా పేరుపొందిన పార్టీల నాయకుల కంటే ఎక్కువగా ఆచరిస్తారు. ఆఖరికి నరేంద్ర మోడీ కూడా నిజామాబాద్ సభలో జాతకంపై నమ్మకంతోనే కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నాడని విమర్శించాడు. కానీ ఇదే నమ్మకం కొన్ని వర్గాలలో ఆయనకు సానుకూల ఓట్లను రాబట్టనుంది. అదే సమయంలో ఎంఐఎం తో అవగాహన ద్వారా ముస్లిం ఓట్లను కూడా సాధించుకొనగలిగే చతురత ఆయనకు ఉంది.        

సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రాంతీయ సమస్యల కన్నా జాతీయ సమస్యలే ప్రధాన అజెండాగా మారే అవకాశముంది. ప్రధానంగా గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లలో కొన్ని బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశముండేది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎన్నికలు రావడం వలన ఆ సమస్య ఉండదు. 

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత 

రాష్ట్ర ప్రజానీకం కెసిఆర్ పట్ల, ఆయన పాలన పట్ల సానుకూలతను ప్రదర్శిస్తున్నా, క్షేత్ర స్థాయిలో స్థానికంగా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కొన్ని ప్రాంతాలలో ఇది ఓటమికి దారితీయనుంది. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ప్రభుత్వ ఉద్యోగావకాలు కల్పించకపోవడం, మిషన్ భగీరథలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంలాంటివి కొన్ని వర్గాలలో రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తికి కారణాలుగా ఉన్నాయి. ఇళ్లపై వివరణ ఇచ్చి సవరించుకుంటామని కెసిఆర్ హామీ ఇచ్చారు కానీ మిగిలిన వాటిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.      

ఫలితాలు ఎలా ఉండవచ్చు 

ప్రజాకూటమిలో టిడిపి చేరిన తరువాత చంద్రబాబు సహాయంతో మీడియా ద్వారా కొంతవరకు అనుకూల వాతావరణం ఏర్పడిందనే భావనను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ప్రజలలో అలాంటిదేమీ లేదు.   

క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే అవి ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి మరో అవకాశం ఇస్తారనే విధంగా ఉన్నాయి. కెసిఆర్ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల పాటే అధికారంలో ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి ప్రజా కూటమిలోని పక్షాలే అధికారంలో ఉన్నాయి. కెసిఆర్ గారి పార్టీకి 70+ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల వాతావరణం మరింత అనుకూలిస్తే 80+ సీట్లు కూడా రావచ్చు.     

0/Post a Comment/Comments

Previous Post Next Post