కాంగ్రెస్ పార్టీ తమ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మానిఫెస్టోలో భాగంగా ఎన్నో జనాకర్షక హామీలు ఇచ్చింది. వీటిలో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ, పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి లాంటివి ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. వీటితో పాటు విద్యుత్ రంగంలో గృహ వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన హామీని కూడా దానిలో పేర్కొన్నారు. 100 యూనిట్ల లోపు ఉపయోగించే అందరు గృహ వినియోగదారులకు, అంతేకాకుండా 200 యూనిట్ల లోపు వినియోగించే బిసి, ఎస్సీ మరియు ఎస్టీ వినియోగదారులకు విద్యుత్ పూర్తిగా ఉచితమని ప్రకటించారు. ఈ పథకంతో దాదాపు 50 శాతానికి పైగా గృహ వినియోగదారులు ఉచిత విద్యుత్ పరిధిలోకి రానున్నారు.
ఇప్పటివరకు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించే గృహ వినియోగదారులకు మాత్రమే ఉచితం. కానీ ఇంత తక్కువ వాడే వినియోగదారులు పరిమితమే. విద్యుత్ రంగంలో ఇప్పటికే క్రాస్ సబ్సిడీల భారం మోయలేనిదిగా ఉంది. క్రాస్ సబ్సిడీలు అంటే బిల్లులు కట్టని/ వాటి పరిధి లోకి రాని వారి భారాన్ని కూడా సక్రమంగా బిల్లు చెల్లించే వారి పైనే మోపటం. ఎక్కువ విద్యుత్ వాడే గృహ వినియోగదారులు, వాణిజ్య వినియోగదారులు ఇప్పుడు యూనిట్‌కు ఏడు రూపాయలకు పైగానే చెల్లిస్తున్నారు. వారిపై మరింత భారం మోపితే వారు నష్టపోయి వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు మూతపడే అవకాశముంది. లేదా ప్రత్యామ్నాయం చూసుకునే/ కోరే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఏటా వేలకోట్ల నష్టాలలో ఉన్నాయి. అవి అదనపు భారాన్ని ఏ మాత్రం మోయలేవు. ఇక్కడ సరఫరా నష్టాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. వేలకోట్లు ఖర్చు చేసి పంపిణీ వ్యవస్థను భారీ స్థాయిలో మెరుగుపరిచినా సరఫరా నష్టాలు తగ్గకపోవటానికి విద్యుత్ చౌర్యం, అవినీతితో వీటికి సహకరించే సిబ్బంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రంగంలో సిబ్బంది వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం సంస్థలకు చెల్లిస్తోంది. అవి సరిపోవటం లేదని పంపిణీ సంస్థలు వాదిస్తున్నాయి.
ఈ రకంగా కొనసాగితే భవిష్యత్తులో బిల్లు చెల్లించే వినియోగదారులందరూ టెలికాం వ్యవస్థ తరహాలో విద్యుత్ పంపిణీకి ప్రైవేటు సంస్థలను అనుమతించాలని కోరే అవకాశం ఉంది. పంపిణీలో ఒకటికి మించిన సంస్థలు ఉంటే వారికి ఆకర్షణీయమైన, అనుగుణమైన పథకాలు అందించే సంస్థను ఎన్నుకునే అవకాశం కూడా వినియోగదారులకు ఉంటుంది. అప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వ పంపిణీ సంస్థలు బిఎస్ఎన్ఎల్ తరహాలో ప్రాధాన్యం కోల్పోతాయి.
Post a Comment