మేము కూడా ఆంధ్రా రాజకీయాలలో వేలుపెడతాం అని కెటిఆర్ అనడంలో వాస్తవికత ఎంత?

ఒక ఎన్నికల ప్రసంగంలో భాగంగా కెటిఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణాలో తమకు వ్యతిరేకంగా ప్రజా కూటమిలో చేరటంపై వ్యాఖ్యానిస్తూ మేము కూడా ఆంధ్రా రాజకీయాలలో వేలు పెడతాం. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక నిజంగా అటువంటి ఉద్దేశ్యాలున్నాయా?  

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించటానికి, కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి అవతరించినదని తెలంగాణ వాదుల నమ్మకం. ఇదే రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రధానమైన బలం. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రయోజనాలకన్నా జాతీయ రాజకీయాలే ముఖ్యం. అలాగే టిడిపి తెలుగు ప్రజల కోసం అని ఎంత చెప్పుకున్నా దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఇలా ఈ రాష్ట్రానికే పరిమితమైన మరొక బలమైన పార్టీ లేకపోవటం టిఆర్ఎస్‌కు ఉన్న సానుకూలాంశం. 

కోదండరాం గారు కూడా ఇలా తెలంగాణే ప్రధానంగా పనిచేస్తారని నమ్మేవారు. కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్, టిడిపిలు ఉన్న కూటమిలో చేరటంతో ఈ విషయంలో ఆ వర్గం ప్రజల మద్దతును కోల్పోయారు. కెసిఆర్ విధానాలలో తెలంగాణాను వ్యతిరేకించిన వారికి కాబినెట్ పదవులు ఇవ్వటం, పరిపాలనలో ఇతర లోటుపాట్లపై అసంతృప్తి ఉన్నా వారికి టిఆర్ఎస్ పార్టీని బలపరచడం మినహా ప్రస్తుతానికి మరొక ప్రత్యామ్నాయం లేదు. 

ఆంధ్రప్రదేశ్‌లో కెసిఆర్ పాలనకు కొంతమంది అభిమానులున్నా, అక్కడ టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసే పరిస్థితిగానీ, కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవగలిగే బలంగానీ లేవు. ఆ రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకతకు భయపడి టిఆర్ఎస్ పార్టీ మద్దతును తీసుకోలేదు. అందువలన అక్కడి రాజకీయాలలో వేలుపెట్టడం అనేది కూడా కష్టమే. పైగా అక్కడ పోటీ చేస్తే తెలంగాణ ప్రయోజనాలకోసమే పోరాడే ఏకైక పార్టీగా ఉన్న ప్రత్యేకతను పోగొట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ వ్యాఖ్యలు కెటిఆర్ గారు కేవలం అత్యుత్సాహంతో, అనాలోచితంగా చేసినవనే భావించవచ్చు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post