బెంగళూరు Vs హైదరాబాద్

దేశంలో ఐటీ రంగంలో తొలి రెండు స్థానాలలో ఉన్న బెంగళూరు, హైదరాబాద్ నగరాలను అనేకసార్లు పోల్చి చూడటం జరుగుతుంది. ఐటీ ఎగుమతుల విషయములో స్టార్ట్ అప్ కంపెనీలకు అనువైన వాతావరణం కల్పించే విషయంలో బెంగళూరు నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 365 రోజులు పనిచేయటానికి అనువైన సమ శీతోష్ణ వాతావరణం, ఐటీ పట్ల ప్రభుత్వ దృక్పథం బెంగళూరు నగర అభివృద్ధికి దోహదపడ్డాయి. 

ఈ మధ్య కాలంలో బెంగళూరును మౌలిక వసతుల లేమి కలవరపెడుతోంది. కరెంటు కోతలు, నీటి కొరత, ట్రాఫిక్ సమస్యలు, జీవన వ్యయం విపరీతంగా పెరగటం ఇప్పుడు నగరాన్ని పట్టి పీడిస్తున్నాయి. కన్నడిగ ఉద్యమాలు, కావేరీ జల వివాదం నగరాన్ని అతలాకుతలం చేసాయి. నగరం అతిగా విస్తరించటం వలననే ఈ సమస్యలన్నీ ఏర్పడ్డాయని స్థానికులు భావిస్తున్నారు. మరింత విస్తరణకు వారు బహిరంగానే వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.    

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత హైదరాబాద్‌లో ప్రశాంతత నెలకొంది. నగరంలోనే కాకుండా రాష్ట్రమంతటా వేసవిలో కూడా 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. రాబోయే 50 సంవత్సరాల వరకు నీటి కొరత ఉండదని GHMC వర్గాలు హామీ ఇస్తున్నాయి. ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య ఇప్పుడిప్పుడే తీవ్రమవుతోంది. నగర విస్తరణకు ప్రజలు అనుకూలంగా ఉండటమే కాకుండా ప్రభుత్వ భూములు కూడా అందుబాటులో ఉన్నాయి. పోలీసు వ్యవస్థ ఆధునీకరించబడటంతో భద్రత విషయంలో కూడా ఎంతో మెరుగుపడింది.  

బెంగళూరు నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే కొన్ని విశిష్టతలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో లాగ వేసవిలో 40 డిగ్రీలు దాటే ఉష్ణోగ్రతలు నమోదు కావు. విదేశీ నగరాల స్థాయిలో నైట్ లైఫ్, పబ్ కల్చర్ అభివృద్ధి చెందాయి. వారాంతంలో వెళ్లి వచ్చేందుకు వీలుగా విహార యాత్రా కేంద్రాలు, ట్రెక్కింగ్ వసతులు సమీపంలో ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువే. 

హైదరాబాద్ నగరంలో జీవన వ్యయం తక్కువ. 2-3 నెలల అడ్వాన్స్ తోనే అద్దె ఇళ్ళు లభ్యమవుతాయి. ఫుడ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మూవీస్, ఇతర ఎంటర్‌టెయిన్‌మెంట్ వ్యయం కూడా సామాన్యులకు అందుబాటులో ఉంది. జనాభాలో ఎక్కువ శాతం హిందీ మాట్లాడగలరు. రోడ్లు బెంగళూరుతో పోలిస్తే విశాలంగా ఉన్నప్పటికీ ప్రజలకు ట్రాఫిక్ సెన్స్ తక్కువ, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద అడ్డదిడ్డంగా వెళ్లటం కనిపిస్తుంది. ఫార్మా & బయో టెక్నాలజీ లాంటి ఇతర రంగాల అభివృద్ధి విషయంలో కూడా హైదరాబాద్ ముందంజలో ఉంది.  

0/Post a Comment/Comments