ఇంకెన్నాళ్లీ 'సూర్యవంశ' ప్రభ?

మనలో చాలా మంది తెలుగులో వెంకటేశ్, మీనా హీరో హీరోయిన్లుగా వచ్చిన సూర్యవంశం సినిమాను చూసే ఉంటారు. ఈ సినిమా హిందీ రీమేక్  అమితాబ్ హీరోగా 1999 లో వచ్చింది. ఈవీవీ సత్యనారాయణ దీనికి దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా విడుదలైనప్పుడు పెద్దగా విజయవంతం కాలేదు. మొత్తంగా కేవలం ఏడు కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే సాధించగలిగింది. 

అయితే ఇదే సూర్యవంశం సినిమా Sony Max టెలివిజన్ ఛానెల్‌లో మాత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. సినిమా వచ్చి ఇప్పటికే దాదాపు ఇరవై ఏళ్లయినా, ఇప్పటికే కొన్ని వందల సార్లు ప్రదర్శితమైనా టెలివిజన్ రేటింగులలో మాత్రం ఇంకా అదరగొడుతోంది. ప్రతీ సంవత్సరం BARC రేటింగ్ ప్రకారం టాప్ 5 సినిమాల జాబితాలో తన స్థానాన్ని నిలుపుకొంటోంది. గత సంవత్సరం బాహుబలికి ధీటుగా నిలువగా, ఈ సంవత్సరం గోల్‌మాల్ ఎగైన్ తో రేటింగుల జాబితాను పంచుకుంది. ఈ సినిమా టెలివిజన్ సంపాదన థియేటర్ వసూళ్లతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ.  

సాధారణంగా ఈ ఛానెల్‌లో దక్షిణాదికి చెందిన సినిమాలను హిందీలో డబ్ చేసి ప్రదర్శిస్తుంటారు. ఈ డబ్బింగ్ సినిమాలకు 2015 లో బాహుబలి విడుదల తరువాత విపరీతంగా డిమాండ్ నెలకొంది. ఈ ఛానెల్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయం ప్రకారం "దక్షిణాది సినిమాలు కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించటానికి ఎక్కువ అనువుగా ఉంటాయి మరియు ప్రేక్షకులు అప్పటికే థియేటర్లలో చూసి ఉండరు. అందువల్ల కొత్త హిందీ సినిమాలతో పోలిస్తే వీటికి ఆదరణ ఎక్కువ."  

సూర్యవంశం సినిమాను అయితే వారు ప్రత్యేకమైనదిగా అభివర్ణించారు. ప్రారంభంలో బాలీవుడ్ ప్రముఖ హీరో ఉండి థియేటర్లలో ఎక్కువ మంది చూడకపోవడం వలన ఆదరణ పొందింది. అంతేకాక కుటుంబ సభ్యులందరితో కలిసి వీక్షించే కథ కావటం, ఆసక్తికరమైన కథనం ఉండటం, కొంచెం కొంచెం ముక్కలుగా చూడటానికి అనువుగా ఉండటం వంటి వాటితో ఇన్ని సంవత్సరాలైనా ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ నెలకు కనీసం ఒకసారైనా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇలా టెలివిజన్లో ఎక్కువగా రిపీట్ అయ్యే హిందీ సినిమాలలో టార్జాన్ ది వండర్ కార్, జానీ దుష్మన్, ఏక్ ఆనోకి కహానీ, రామయ్య వస్తావయ్యా కూడా ఉన్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post