తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ప్రొఫెసర్ కోదండరాం గారికి ఇప్పుడిప్పుడే అసలైన రాజకీయాలు అనుభవమవుతున్నాయి. ఇప్పటికే ఆయన మహాకూటమి పేరుతో తెలంగాణాకు వ్యతిరేకులుగా ముద్రపడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వారితో జతకట్టడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాన్చివేత ధోరణి, ఒంటెత్తు పోకడ, చివరి నిమిషంలో వెన్నుపోట్ల మూలంగా సార్‌కు వ్రతం చెడ్డా ఫలితం కూడా దక్కడం లేదు.
కోదండ రామ్ గారు జనగామ నుండి అభ్యర్థిగా పోటీలో నిలవాలని భావించారు. అయితే బీసీ సమీకరణ తెరపైకి తెచ్చి ఆయనను పోటీలో లేకుండా విరమింప చేసారు. దీనితో ఆయన కేవలం ప్రచార బాధ్యతలు మాత్రమే చూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. తాజాగా పిసిసి అధ్యక్ష్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ జన సమితి పోటీ చేస్తున్న సీట్లయిన వరంగల్ తూర్పు, దుబ్బాకలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫాంలు జారీ చేసి కోదండరాం గారికి షాక్ ఇచ్చారు. 34 సీట్లలో పోటీ చేయాలనుకున్న జనసమితి ముందు 19కి, తర్వాత 14కు, 8కు సీట్లకు చేరి చివరికి ఆరు సీట్లకు పరిమితమైంది. నామినేషన్ల సమయం ముగుస్తున్న వేళ అసలు ఎన్నిసీట్లలో పోటీ చేస్తున్నారో తెలియని అయోమయం ఆ పార్టీలో నెలకొంది. ఆయన పరిస్థితి ఎలా తయారయిందంటే ఆయనను కలవటానికి ఇష్టపడక అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వని ముఖ్యమంత్రి కుమారుడు కూడా ఇప్పుడు సానుభూతి ఒలకపోస్తున్నారు.
మహా (ప్రజా?) కూటమిలో ఈ తరహా విభేదాల వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ లాభపడనుంది. అసలు జన సమితికి ఓటు వేసే తెలంగాణ వాదులు, జెఏసిలు, టిడిపి ఓటు బ్యాంకు భిన్న ధృవాల వంటి వారు. వారిద్దరూ ఒక్కరికే ఓటు వేయటం అనేది కష్ట సాధ్యం. పైగా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఇస్తున్న ఈ రకమైన గౌరవం వల్ల వారి మొగ్గు టిఆర్ఎస్ వైపే ఉండే అవకాశముంది.
Post a Comment
Note: only a member of this blog may post a comment.