జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో జరిగిన ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో మాత్రమే ఉనికిని చాటుకోగలిగింది. అక్కడ మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోగలిగింది. మిగిలిన ప్రాంతాలలో అసలు కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది.
ఒక రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో మనుగడ సాగించటం కష్టం అని భావించారో, లేక మరేదైనా ఇతర కారణం ఉందో గానీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత పార్టీ అధినేత తెలంగాణ రాజకీయాల పట్ల, పార్టీ నిర్మాణం పట్ల కనీస ఆసక్తిని ప్రదర్శించలేదు. దానితో వైసిపి జెండాపై గెలిచిన వారందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. పార్టీ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు 2018లో ఎన్నికలలో ఈ ప్రాంతంలో వైసిపి పోటీ చేస్తుందని కూడా ఎవరూ భావించలేదు.
కాగా, తెలంగాణలో ఎన్నికల నామినేషన్లు ప్రారంభమవటానికి రెండు రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో తాము తెలంగాణాలో ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని, 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తెలంగాణాలో పార్టీ నిర్మాణం పై దృష్టి సారించామని 2024 (2023?) ఎన్నికలలో అన్ని స్థానాలలో పోటీ చేస్తామని కూడా అందులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయబోమని స్పష్టంగా తెలియచేసారు కానీ, అందుకు వారు పేర్కొన్న కారణం మాత్రం సహేతుకంగా లేదు. ఇక్కడ పోటీ చేస్తే, ఆర్నెల్ల తర్వాత జరిగే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సన్నద్ధతకు వచ్చే ప్రమాదం ఏమిటో? రాజకీయాలలో జగన్మోహన రెడ్డి వైఖరి విభిన్నంగా ఉంటుంది. జాతీయ రాజకీయాలలో, మరియు పొరుగు రాష్ట్రాల రాజకీయాల విషయంలో అన్ని పార్టీల నుండి సమదూరం పాటించాలని భావిస్తున్నట్లున్నారు.
జగన్ తెలంగాణను కర్ణాటక, తమిళనాడుల తరహాలో కేవలం ఒక పొరుగు రాష్ట్రంగా మాత్రమే పరిగణిస్తున్నాడు. ఎవరు అధికారంలోకి వచ్చినా భవిష్యత్తులో సమస్యలు లేకుండా ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తుండవచ్చు. అయితే ఈ రకమైన ఎత్తుగడ వలన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆయనకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న సెంటిమెంట్ వల్ల ఆయనతో పోరాడిన ఘనత, ఓట్లు చంద్రబాబుకు మాత్రమే దక్కుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచామని చాటుకోగలిగే సామర్థ్యం కూడా చంద్రబాబు గారికి ఉంది.
Post a Comment