టిఆర్ఎస్ అందించే అవకాశాలను వైరిపక్షాలు ఉపయోగించుకోగలవా?

చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితికి, చేవెళ్ల స్థానానికి రాజీనామా సమర్పించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనువడు. ఆయన పేరు మీదే రంగా రెడ్డి జిల్లా ఏర్పడింది. ఎన్నికల వాతావరణం సానుకూలంగా ఉన్న దశలో ప్రముఖ ఎంపీ పార్టీని వీడిపోవటం గెలుపు అవకాశాలపై ఖచ్చితంగా ప్రభావం చూపగలదనే భావన నెలకొంది.  

రాజీనామాకు దారితీసిన ఐదు కారణాలను ప్రస్తావిస్తూ, విశ్వేశ్వర్‌రెడ్డి రాసిన మూడు పేజీల లేఖ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేస్తూ, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి పార్టీలో, ప్రభుత్వంలో ప్రముఖ స్థానాన్ని కల్పించటం  అనేది ఆయన లేఖలో ప్రధాన ఆరోపణగా ఉంది. 

చాలా రోజుల నుండి ఇదే ఆరోపణ పార్టీలో, ఉద్యమకారులలో మరియు కార్యకర్తలలో అంతర్గతంగా అసంతృప్తికి కారణమవుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన వారిలో మంత్రి మహేందర్ రెడ్డితో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొండా సురేఖ మరియు దానం నాగేందర్ లాంటి వారు ఉన్నారు. వీరందరికి కెసిఆర్ పార్టీలో ప్రాముఖ్యత నిచ్చారు. ఇలా అసంతృప్తిగా ఉన్న తెలంగాణ వాదులకు జనసమితి నేత కోదండరాం గారిపై సానుభూతి, సానుకూల అభిప్రాయం ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉండటంతో ఈ ఓటుబ్యాంకును ఆకర్షించగలగటం వారికి క్లిష్టంగా మారింది.          

తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీలో చేరిన మహేందర్ రెడ్డికి ఇస్తున్న అధిక ప్రాధాన్యంపై కినుక వహించిన విశ్వేశ్వర్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. కానీ కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి  టిఆర్ఎస్ నుండి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరనున్నారు అని ప్రకటించినప్పుడు విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాం నాయక్‌ల పేర్లు వినిపించాయి. కానీ ఇద్దరూ ఆ వార్తలను ఖండించారు. ఆ సమయంలో కెటిఆర్ గారు కూడా విశ్వేశ్వర్‌రెడ్డి గారితో చర్చలు జరిపి అంతా సవ్యంగా ఉందనే సందేశం పంపారు. కానీ కొద్ది రోజులలోనే ఆయన రాజీనామా చేసారు. ఇవాళ ఉదయం రాహుల్ గాంధీతో సమావేశం అయి 23వ తేదీన సోనియా గాంధీ నేతృత్వంలో జరుగనున్న మేడ్చల్ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.  

తాజాగా రేవంత్ రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రమే కాకుండా మరో ఇద్దరు ఎంపీలు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రకటించారు. వీటిని సీతారాం నాయక్ గారు ఖండిస్తూ తాను ప్రొఫెసర్‌నని, పార్టీలు మారే రాజకీయ నాయకుడిని కాదని  అన్నారు. దీనితో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు డి శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post