అండమాన్ ఆదిమతెగ చేతిలో అమెరికన్ హతం

అక్రమంగా తమ ద్వీపంలోకి ప్రవేశించిన అమెరికన్ యువకుడిని అండమాన్ దీవిలో నివసించే సెంటినలీస్ తెగ వారు బాణాలు, బరిసెలతో దాడి చేసి హతమార్చారు. మరణించిన వ్యక్తిని 'జాన్‌ అలెన్‌ చౌ' గా గుర్తించారు. ఆయన ఇప్పటికే అండమాన్ ప్రాంతాన్ని ఐదు సార్లు సందర్శించినట్లు తెలిసింది. మత ప్రచారకుడు కావటంతో అతని మృతిపై సోషల్ మీడియాలో కలకలం రేగింది. అతని ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లలో అతను తనని సహస పర్యాటకుడిగా పేర్కొన్నాడు. కొంతమంది మత్సకారులకు డబ్బు ఆశ చూపి ఆయన ఆ దీవిలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. వారు చూస్తుండగానే తెగ వారు అమెరికన్ పై దాడి చేయటంతో మత్స్యకారులు పారిపోయి వచ్చారు.  ఈ విషయమై అతనికి సహకరించిన ఏడుగురు మత్సకారులను  పోలీసులు అరెస్టు చేసారు. చెన్నైలోని అమెరికన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే జాన్‌ అలెన్‌ కనిపించడం లేదని, మిగిలిన వివరాలు వెల్లడించలేమని తెలిపింది.  

ప్రపంచంలో ఒంటరిగా నివసించే ఏకైక ఆదిమతెగ 

ఉత్తర సెంటినలీస్ ద్వీపంలో నివసించే వారిని ఆఫ్రికా నుండి వచ్చిన ఆదిమతెగకు చెందిన వారిగా భావిస్తారు. వారు గత 55వేల సంవత్సరాల నుండి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తమదైన నాగరికతలో జీవిస్తున్నారు. వారు మాట్లాడే భాష ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఇప్పుడు ఇలా బాహ్య ప్రపంచంలో సంబంధం లేకుండా నివసించే తెగ ఇది ఒక్కటే. చెట్లతో దట్టంగా పచ్చని తివాచీలా కనిపించే దీవిలో వారిని శాటిలైట్ల ద్వారా కూడా గమనించలేము. వీరి జనాభా ఏంతో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. దాదాపు 80 నుండి 150 మంది ఉండవచ్చునని భావిస్తున్నారు. 2011 జనాభా గణనలో భాగంగా ప్రభుత్వం సెంటినలీస్ ద్వీపంలో 15 మంది ప్రజలు నివసిస్తున్నట్లు పేర్కొంది.


బాహ్య ప్రపంచంతో సంబంధం లేకపోవటంతో వారి నాగరికత ఆదిమ మానవుల స్థాయిలోనే ఉంది. వారికి చిన్న చిన్న పడవలు చేసుకోవడం మరియు చేపలు వేటాడటం తెలుసు. ఎన్నో ఏళ్లుగా కొబ్బరి బొండాలు మరియు చేపలు మాత్రమే ఆహారంగా జీవిస్తున్నారు. ఇన్నాళ్లు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నందున వారికి ఎలాంటి వ్యాధులు రాకపోవటంతో వారి నిరోధకత అతి తక్కువ. వారి ద్వీపంలో వేరే వాళ్ళు ప్రవేశిస్తే జలుబు, ఫ్లూ మరియు ఇతర అంటువ్యాధులు అంటుకునే వారికి అవకాశం ఉంది. ఏ చిన్న వ్యాధి వచ్చినా అది అందరికీ ప్రబలి తెగ మొత్తం అంతరించిపోవచ్చు.      

ద్వీపవాసులు కూడా ఎవరినీ కలవడానికి ఇష్టపడరు. ఎవరైనా ఆ దీవిలోకి ప్రవేశించాలని చూస్తే వారు బాణాలు మరియు బరిసెలతో దాడి చేసి ప్రాణాలు తీస్తారు. భారత ప్రభుత్వం వారితో కలవడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలను వారు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. 1991లో త్రిలోక్ నాథ్ పండిట్ అనే ఆంత్రోపాలజిస్ట్ వారిని కలవగలిగారు. వారు అతని పడవలోకి వచ్చి అక్కడ ఉన్న వస్తువులను తడిమి కూడా చూసారు. కానీ తరువాత అంటువ్యాధులు ప్రబలి దీవిలో అనేకమంది చనిపోయారు. ఆ తరువాత వారి క్షేమం దృష్ట్యా ఆచారాలను గౌరవిస్తూ ఇతరులు ఆ ద్వీపాన్ని సందర్శించడాన్ని నిషేధించింది. వారిని కలిసినా, లేక ద్వీపం లోకి వెళ్లినా, ద్వీపాన్ని గానీ, వారినిగానీ ఫోటో లేక వీడియో తీసినా మూడేళ్ళ వరకూ శిక్ష పడుతుంది. 

2006లో పడవ పాడై ఆ దీవి దిశగా కొట్టుకుపోయిన ఇద్దరు మత్సకారులు వారి దాడిలో మరణించారు. సునామి సమయంలో వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవటానికి వెళ్లిన భద్రతా దళ హెలికాప్టర్ పై వారు బాణాల వర్షం కురిపించారు. దానితో వారు క్షేమంగానే ఉన్నారని అర్థమైంది. వారికోసం జారవిడిచిన ఆహారాన్ని సైతం కనీసం ముట్టుకోలేదు. ఆ తరువాత మన ప్రభుత్వాలు వారిని దూరం నుండే గమనిస్తున్నాయి. కానీ మళ్ళీ వారి విషయంలో జోక్యం కలిగించుకోవటానికి ప్రయత్నించలేదు.    

ఒకప్పుడు అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్‌లో అనేక ఆదిమ తెగలు నివసించేవి. తమ పరిపాలనా కాలంలో  బ్రిటిష్ వారు అనేక దీవులపై దాడి చేసి వారిని హతమార్చారు. ఇప్పుడు కొన్ని దీవులలో కొంతమంది మిగిలి ఉన్నా వారు బాహ్య ప్రపంచంతో కలిసిపోయారు. 1880లో బ్రిటిష్ ప్రభుత్వం సెంటినల్ తెగపై కూడా దాడి చేసి ఇద్దరు వృద్ధులతో సహా మొత్తం కుటుంబాన్ని అధ్యయనం కోసం బంధించి తీసుకువచ్చింది. కానీ వృద్ధులు చనిపోవటంతో మిగిలిన వారిని మళ్ళీ ద్వీపంపైనే వదిలిపెట్టారు.

గత ఆగస్టులో భారత ప్రభుత్వం ఉత్తర సెంటినలీస్ ద్వీపాన్ని విదేశీయులు సందర్శించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన జాబితానుండి తొలగించడాన్ని అనేక మంది తప్పు పడుతున్నారు. మన దేశీయులకే అనుమతి లేని ద్వీపాన్ని ఆ జాబితాలో ఎలా చేర్చారు అనే విషయంపై, అక్కడికి క్రిస్టియన్ మిషినరీకి చెందిన వ్యక్తి మతవ్యాప్తి కోసం వెళ్లడంపై కూడా  మీడియాలో  తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post