ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో నాయకుల భిన్నవ్యూహాలు

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు సమయోచితంగా బిజెపి, జనసేన పార్టీలతో అవగాహన కుదుర్చుకున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలు వీస్తుండటం, రాష్ట్రంలో ఉన్న కులసమీకరణాల దృష్ట్యా జనసేన ఉపయోగపడుతుందని భావించటం వలన ఆ నిర్ణయాలు తీసుకున్నారు. 

ఆ సమయంలో ఉన్న రాజకీయ వాతావరణం కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలించింది. దేశమంతటా మోడీ ప్రధాని అవుతాడనే భావన ఉండటంతో పాటు, ఆయనతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజలు అనుకున్నారు. అప్పటికే పది సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో పాటు రాష్ట్రాన్ని విభజించిన ముద్ర కూడా పడింది. బిజెపితో పొత్తువలన తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకమనే సందేశాన్ని ప్రజలలోకి పంపటంతో పాటు, వైసిపిని పిల్ల కాంగ్రెస్ అంటూ ప్రచారం కూడా చేసి లబ్ది పొందారు. ఇలాంటి ఎత్తుగడల వలననే తటస్థ ఓటర్లను కూడా తన వైపుకు ఆకర్షించగలిగారు.

జగన్మోహన రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయింది. ఆ సందర్భంగా గెలిచిన కూటమికి వైసిపికి మధ్య ఓట్లలో తేడా కేవలం రెండు శాతమే. ఎన్నికలకు ముందు తాము కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఎన్నికల తరువాత తమకు ప్రత్యేక హోదా కల్పించేవారికే మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. కనీసం వామపక్షాలతో పొత్తు ఉన్నా ఆయన విజయంతో బయటపడేవారనే కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. అంటే సరియైన సమయంలో కుదుర్చుకున్నఅవగాహనలు టిడిపిని విజయపథంలో నడిపించగా, వైసిపి పొత్తులు లేకపోవటం వలన నష్టపోయింది.      
   
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినందున ప్రజలు రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కేంద్ర సహాయాన్ని కోరుకుకుంటున్నారు. ఆ సమయంలో ఒంటరిగా పోటీ చేయటం, కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో స్పష్టత లేకపోవటం మరియు రాజకీయంగా, పరిపాలన పరంగా అనుభవం లేకపోవటం, ప్రజలు కోరుకున్న హామీలు ఇవ్వలేకపోవటం వంటివి జగన్‌కు వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉండటానికి దోహద పడ్డాయి. 

జాతీయ స్థాయిలో ఉన్న ప్రత్యామ్నాయాలు రెండే. అయితే కాంగ్రెస్‌తో లేకపోతే బీజేపీతో వెళ్ళవలసి ఉంటుంది. థర్డ్ ఫ్రంట్ అనేది ఇప్పటికైతే ఊహాగానాలకు మాత్రమే పరిమితం. ఇద్దరిలో ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకోవలసి వస్తుంది. ఎన్నికలకు ముందే జాతీయ పార్టీలతో అవగాహన కుదుర్చుకోవటం వలన లాభ నష్టాలు రెండూ ఉంటాయి. ఒక్కొక్క సారి లాభంగా, మరోసారి నష్టంగా కూడా పరిణమించవచ్చు. పొత్తు పెట్టుకున్న పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చినా వారు మెజారిటీ కోసం ప్రాంతీయ పార్టీపై ఆధారపడినప్పుడు మాత్రమే డిమాండ్లు సాధించుకోవచ్చు.    

2019లో ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్ళీ పొత్తులపై చర్చ మొదలైంది. ఈ సారి చంద్రబాబు కాంగ్రెస్‌తో అవగాహనలో ఉన్నారు. బిజెపి హోదా ఇవ్వలేదు కనుక మిగిలిన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆయన దీనిని సమర్థించుకుంటున్నారు. కాగా ఆయన రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని దానికి హోదా ముసుగు వేస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. రాష్ట్ర విభజన వలన కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత పూర్తిగా తొలగనప్పటికీ ఆయన ధైర్యంగా ముందుకు వెళ్లారు. 

జగన్మోహన్ రెడ్డి స్వభావం మరియు వ్యవహార రీత్యా ఆయన ఇంకొకరితో పొత్తు పెట్టుకుంటారని భావించలేం. ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా ఎన్నికల ముందు పొత్తులకు సంసిద్ధత చూపడంలేదు. ఈ విషయమై ఆయనది ఒంటెత్తు పోకడ అని విమర్శించేవాళ్ళు ఉన్నారు. గతంలో లాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వారికే  భవిష్యత్తులో మద్ధతు ఇస్తామని ప్రకటించవచ్చు. 2014 లాగే ఈ సారి కూడా టిడిపి శ్రేణులనుండి వ్యతిరేక ప్రచారం మొదలైంది. జగన్ బిజెపికి అనుకూలమని ఒకసారి, జనసేనతో  అవగాహనలో ఉన్నాడని మరొకసారి ఆరోపిస్తూ వస్తున్నారు. మూడవ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపైకి వచ్చిన జనసేన మాత్రం వామపక్షాలతో  పొత్తు పొత్తుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post