తెలంగాణ ఏర్పాటు జరిగిన నాలుగున్నర సంవత్సరాల తరువాత మొదటిసారిగా తెలంగాణలో అడుగు పెట్టిన సోనియా గాంధీ ఇక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు కావటంలో సోనియా గాంధీ గారిది ప్రధాన పాత్ర కావటం, ఈ మధ్య కాలంలో ఆరోగ్యం సహకరించకపోవటం వలన ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవటంతో సోనియా పర్యటన ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనపై కాంగ్రెస్/ మహా కూటమి శ్రేణులు భారీ ఆశలే పెట్టుకున్నాయి. రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలలో, రోడ్ షోలలో పాల్గొంటున్నారు.
చాలా రోజుల తరువాత సొంత బిడ్డల దగ్గరకు తల్లి వచ్చినట్లుంది అంటూ సోనియా గాంధీ గారు ప్రసంగంలో భాగంగా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేసారు. తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చామని సానుభూతి పొందే ప్రయత్నం చేసారు. తెలంగాణ వచ్చిన తరువాత ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందని, తెలంగాణ సాధన లక్ష్యాలైన నీళ్లు, నిధులు మరియు నియామకాల సాధనలో ఇక్కడి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం ఎలా పోరాడారో, ఉద్యమ లక్ష్యాల సాధనకు కూడా అలాగే పోరాడాలని ప్రజలకు సూచించారు. కెసిఆర్ యుపిఎ ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ ఒప్పందానికి తూట్లు పొడిచారని, పనికి ఆహార పథకాన్ని అమలు చేయటం లేదని, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో విఫలమయ్యారని కూడా ప్రసంగించారు.
కేంద్రస్థాయి నాయకులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తే ప్రజలలో ఒక విధమైన ఆసక్తి నెలకొంటుంది. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండే నిధులు అధికారాలు ఎక్కువే. రాష్ట్ర స్థాయి నాయకులు ఇవ్వలేని ఏవైనా ప్రత్యేక హామీలు ఇస్తారేమోనని ప్రజలు ఆశిస్తారు. కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి హామీలను ఇవ్వలేదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా గానీ, మరే ఇతర హామీలు గానీ ఇవ్వకపోవటం ఇక్కడి పార్టీ శ్రేణులను, రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచింది. పైగా ఇక్కడి సభలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆయన ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపిలు రెండూ ఒకటే అన్నట్లు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టిడిపి నాలుగేళ్ళ పాటు బిజెపి ప్రభుత్వంలో భాగస్వామి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం కెసిఆర్ స్థాయిలో కూడా హామీలు అమలు చేయలేదు. కాంగ్రెస్, టిడిపిలు రెండూ కూడా కుటుంబ పార్టీలే. ఇటువంటి పరిస్థితులలో కుటుంబ పాలన, హామీల అమలుపై విమర్శలు తగ్గించి జాతీయ స్థాయి నాయకులుగా రాష్ట్రానికి ఏం చేయగలరో చెబితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలాగూ ఇలాంటి విమర్శలు స్థానిక నాయకులు ఇంతకన్నా ఎక్కువగానే చేయగలరు.
Post a Comment