తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అప్పుడప్పుడు జాతీయ రాజకీయాలలో తాము కీలక పాత్ర పోషిస్తామని వ్యాఖ్యానిస్తుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పుడప్పుడూ దేశ రాజకీయాలలో థర్డ్ ఫ్రంట్ అవసరమని, రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు దాదాపు ఒకే విధానాలను అవలంభిస్తాయని, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తాయని, ప్రజా సంక్షేమం వారికి పెద్దగా పట్టదని ప్రసంగాలు చేస్తుంటారు. కొన్నాళ్ళు దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చిస్తున్నట్లు హడావిడి చేసి తర్వాత మిన్నకుండిపోయాయారు. ఇప్పుడు ఎన్నికల సభలలో కూడా థర్డ్ ఫ్రంట్ అవసరాన్ని, రాష్ట్రాల హక్కులను, అధికార వికేంద్రీకరణ వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడూ రాష్ట్రంలో అధికారాలను వికేంద్రీకరిద్ధామని మాత్రం ఆలోచించలేదు.
కేంద్ర ప్రభుత్వ విధానాలయిన నోట్ల రద్దు, పెట్రోల్ ధరల పెంపు, జిఎస్టి లాంటి వాటికి వ్యతిరేకంగా కెసిఆర్ మాట్లాడలేదు. బిజెపి ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయకున్నా, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకున్నా, కేంద్ర నిధులలో రాష్ట్రానికి వాటా తగ్గించినా పట్టించుకోలేదని, ఉద్యమాలు చేయలేదని వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి థర్డ్ ఫ్రంట్ రాగం ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది. 2019 ఎన్నికల తరువాత ఆయన అవకాశం వస్తే, తనకూ, రాష్ట్రానికి లాభం అనుకుంటే కాంగ్రెస్, బిజెపిలలో ఎవరికైనా మద్దతివ్వగలడు.
చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలో తాను చక్రం తిప్పుతానని, వచ్చే ఎన్నికల తరువాత కీలక పాత్రను పోషిస్తానని అంటారు. ఈ మధ్య ఆయన బిజెపి వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటులో తలమునకలై ఉన్నారు. కాంగ్రెస్‌తో భాగస్వామ్యం, ప్రాంతీయ పార్టీల నేతలతో మంతనాలు ఇలా ప్రతీరోజు బిజెపికి వ్యతిరేకంగా వార్తలలో కనిపిస్తున్నారు. ఇది ఆయన బిజెపితో నాలుగేళ్ల పాటు నెరపిన భాగస్వామ్యాన్ని మరుగున పరచే ప్రయత్నంలో భాగమే.
దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ వారి మరియు వారి రాష్ట్ర అభివృద్ధి ప్రధానాంశంగా పని చేస్తుంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన నాయకులెవరూ, రేపు ఎన్నికల తర్వాత బిజెపి పూర్తి మెజారిటీకి కొద్ధి దూరంలో ఆగిపోతే మద్దతివ్వరని గ్యారెంటీ ఉండదు. అంతెందుకు, ఇప్పుడు ఇలా బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయటానికి అంతా తానై ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారే ఆ అవకాశాన్ని వినియోగించుకోవటానికి అందరికన్నా ముందు ప్రయత్నిస్తారు. ప్రాంతీయ పార్టీలు అన్నీ వారి రాజకీయ అవసరాలే ప్రధానంగా కూటములు కడతాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించే అవకాశం ఎప్పుడో ఒకసారి ఎవరికో వస్తుంది. అది పూర్తిగా ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు గెలిచిన సీట్ల సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది.
Post a Comment