సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కోసం ఆ దేశంలో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు. అయినా మనదేశం ఇప్పటికీ ఇండియాకు పేదరికాన్ని నిర్మూలించటం పేరిట ఆర్థిక సహాయాన్ని (ఎయిడ్) అందిస్తోంది. అని ఇటీవల ఒక బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడు వ్యాఖ్యానించినట్లుగా అక్కడి పత్రికలలో ప్రముఖంగా వచ్చింది.
ఈ మధ్య కాలంలో యూకేలో పన్ను చెల్లించేవారి ఆదాయాన్ని ఇతర దేశాలకు ఆర్థిక సహాయం పేరిట అందించటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్దార్ పటేల్ విగ్రహం గురించి మాత్రమే కాదు, గత కొన్ని సంవత్సరాలలో మన దేశంలో ఏ విశేషం జరిగినా ఈ ఆర్థిక సహాయానికి ముడిపెట్టి ఇలాంటి వ్యాఖ్యలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. మన ఆర్థిక వృద్ధి రేటు 7 % కన్నా ఎక్కువ అని ప్రకటించినప్పుడూ, మంగళయాన్ ప్రయోగం జరిగినప్పుడూ, ఫోర్బ్స్ పత్రిక యూకేలో ఉన్న బిలియనీర్ల సంఖ్య కన్నా ఇండియాలో ఉన్న బిలియనీర్ల సంఖ్య ఎక్కువ అని ప్రకటించినప్పుడూ కూడా ఇలాంటి చర్చే అక్కడ జరిగింది.
మనదేశం ఏ ఇతర ప్రభుత్వం నుండి ప్రత్యక్షంగా ఆర్థిక సహాయాన్ని స్వీకరించటం లేదు. కొన్ని దేశాలు ఆర్థిక సహాయం పేరిట ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ ఆర్థిక సహాయం పై మనదేశంలో కూడా సదభిప్రాయం లేదు. వీటిలో ఎక్కువ భాగం మత ప్రచార సంస్థలకు, లాబీయింగ్ కోసం మరియు కొన్ని అనైతిక కార్యకలాపాలకు వాడుతున్నట్లుగా విమర్శలు కూడా ఉన్నాయి.
మాకు యూకే నుండి గానీ మరే ఇతర దేశం నుండి గానీ ఆర్థిక సహాయం అవసరం లేదని 2008 మరియు 2011 లలో మనదేశం స్పష్టం చేసింది. బ్రిటీష్ ప్రభుత్వం కూడా 2015 లోపే ఈ నిధులను నిలిపివేస్తామని ప్రకటించింది. అయినా ఇప్పటికీ ఆ నిధులు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
Post a Comment