తెలుగుదేశం పార్టీ - కొంతకాలం క్రితం వరకూ తెలంగాణాలో బలమైన రాజకీయ పార్టీ. కానీ 2009 తరువాత ఉద్యమ ప్రభావం వలన, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించకపోవటం వలన ఈ ప్రాంతంలో క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయింది. 2014 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంతో రెండు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ఉన్న విభేదాలతో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడింది. ఓటుకు నోటు ఉదంతం అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని చావు దెబ్బ తీసింది. తెలుగుదేశం పార్టీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా భావింపచేయటంలో విజయవంతమైన టిఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులను, క్యాడర్‌ను భారీగా ఆకర్షించగలిగింది.
2014 ఎన్నికల సమయంలో టిడిపి హైదరాబాద్‌లో బిజెపితో కలిసి భారీగా ప్రభావాన్ని చూపగలిగింది. మొత్తం తెలంగాణాలో టిడిపికి చెందిన 15మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కానీ గెలిచిన వారిలో చాలామందిని పార్టీ నిలుపుకోలేకపోయింది. ఆ తరువాత జరిగిన హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో ఘోరంగా ఓటమి చెందింది.
కాగా ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు నిర్ద్వంద్వంగా టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేఖ వైఖరిని తీసుకోవటం ఆసక్తిని కలిగిస్తోంది. మహా కూటమిలో చేరి వారిని గెలిపించటానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. రెండు ప్రాంతాలలో ఏక కాలంలో ఎన్నికలు జరగడంలేదు కనుక ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఒకవేళ ఇక్కడ టిఆర్ఎస్ గెలవలేక పొతే అది ఆయనకు భారీ సానుకూలాంశం కానుంది. మళ్లీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అది ప్రతికూలంగా పరిణమించవచ్చు.
ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో స్థిరపడిన కొన్ని వర్గాలలో ప్రభావాన్ని కలిగి ఉంది. నగరంలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఇప్పటికీ బలంగానే ఉంది. రాబోయే ఎన్నికలలో ఈ పార్టీ కొంతవరకు ప్రభావం చూపగలదు.ఇక జిల్లాలలో చాలావరకు నాయకులు మరియు క్యాడర్ టిఆర్ఎస్ మరియు ఇతర పార్టీలలో చేరిపోయారు. కొన్ని ప్రాంతాలలో తప్ప, మెజారిటీ ప్రాంతాలలో నాయకులు లేకుండా పోయారు. హైదరాబాద్ బయట తెలుగుదేశం పోటీ చెయదగ్గ నియోజకవర్గాలు పరిమితమే. మహా కూటమిలో భాగంగా ఉన్న కారణంగా ఈ పార్టీ ఎక్కువ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించింది. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో తమ ఎమ్మెల్యేల సంఖ్య కన్నా కూటమి విజయానికే ప్రధానంగా కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది. సీట్ల సంఖ్య విషయంలో ఎప్పుడూ లేని స్థాయిలో పట్టు విడుపులు ప్రదర్శించటం కూడా ఆ అభిప్రాయాన్ని బలపరుస్తోంది.
Post a Comment