తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి తన సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్‌లో పరిస్థితి సానుకూలంగా లేదని గత కొంతకాలంగా వివిధ ప్రసార మాధ్యమాలలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతమంది మరింత ముందుకు వెళ్లి ఆయన ఈ సారి నియోజకవర్గాన్ని మార్చనున్నారని, అక్కడి నుండి కాకుండా సిద్ధిపేట నుండి పోటీ చేస్తారని కూడా వ్యాఖ్యానించారు. అయితే కెసిఆర్ గారు గజ్వేల్ నుండి నామినేషన్ దాఖలు చేసి, ఈ పుకార్లకు చెక్ పెట్టారు.
గత ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సారి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగనున్నారు. ఈ తడవ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆయనకు సానుకూలంగా లేవు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారిని టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించ గలిగినప్పటికీ ఇప్పటి పరిస్థితులలో ఆయన చూపగలిగే ప్రభావం తక్కువే.
హరీశ్ రావు తనకు ఫోన్ చేసి తన గెలుపుకు సహకరిస్తానని తెలిపారని ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అవి కొంత వరకు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. నిరాశ, ఓటమి భయంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. నిజంగా గెలుపుకు సహకరించే వారిని ఎవరూ అలా బయటపెట్టుకోరు.
2014 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎప్పుడూ విజయం సాధించలేదు. ఈ ప్రాంతంలో పార్టీకి పెద్దగా క్యాడర్ కూడా లేకుండేది. ఆ సమయంలో కెసిఆర్ ఈ నియోజక వర్గం నుండి బరిలోకి దిగడం ఒక రకంగా సాహసం వంటిదే. కానీ గెలిచిన తరువాత ఈ నియోజక వర్గంలో టిఆర్ఎస్ పార్టీ బలపడింది. అంతే కాక ముఖ్యమంత్రి నియోజకవర్గం కావటంతో గజ్వేల్ ప్రాంతం అభివృద్ధి చెందింది. రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్య మరియు వైద్య అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. సాగు నీటి సౌకర్యం కూడా తొందరలోనే కల్పించబడుతుందని, రైలు మార్గం కూడా రానుందని ఆశలు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయటం కష్టమే. ఈ నియోజక వర్గం నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన కెసిఆర్ గారు భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Post a Comment