ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడనున్నందున ఎలాగైనా గెలుస్తామని 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ అపజయం పొంది ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. శాసనసభ గడువుకు ఆరు నెలల ముందుగానే రద్దవటంతో, 2018 డిసెంబరులో జరగనున్న ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తోంది. ఎన్నికల ఎత్తుగడలలో భాగంగా ప్రజా కూటమి పేరుతో తెలుగు దేశం, తెలంగాణ జన సమితి మరియు సిపిఐ పార్టీలతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగింది.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ బలం కన్నా ఎదుటివారి బలహీనతలపైనే ఎక్కువగా ఆధారపడనుంది. అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత, కొన్ని హామీల అమలులో ప్రభుత్వం విఫలం కావటం లాంటివి తమకు కలసి వస్తాయని భారీ ఆశలు పెట్టుకుంది. ఈ అంశాల పైనే పూర్తిగా ఆధారపడలేక ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నట్లు కనిపిస్తోంది.
2014 తరువాత కాంగ్రెస్ పార్టీలో ఓటమిపై పెద్దగా విశ్లేషణ జరగలేదు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలోగానీ, ఆలోచనా విధానంలోగానీ పెద్దగా మార్పులు చేసుకున్నట్లు కనిపించలేదు. అసలు ముందస్తు ఎన్నికలకు సంసిద్ధంగానే లేదు. ఎన్నికలు ముంచుకు రావటంతో హడావిడిగా మహా కూటమి పేరిట పొత్తులకు తెర తీసారు. నామినేషన్లు ముగిసినప్పటికీ వీరి సీట్ల పంపకాలు మాత్రం ఒక కొలిక్కి రాలేదు. అసలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపితో పొత్తుపై ప్రజలలో ఇంకా సందేహాలున్నాయి. సిద్ధాంతాల పరంగా భిన్న ధృవాలైన టిడిపి, జన సమితులు రెండింటితో కలిసి పోటీ చేయటం వలన ఓట్లు బదిలీ కావటం క్లిష్టం కావచ్చు.
కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలే కొంతవరకు అసంబద్ధంగా ఉన్నాయి. కుటుంబ పాలనలో మునిగి తేలుతూ ఎదుటివారిది కుటుంబ పాలన అంటూ విమర్శించటం, వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ అసలు సమస్యలను పట్టించుకోకపోవటం కనిపిస్తుంది.
గత సంవత్సరం నుండి ఇదేనా బంగారు తెలంగాణ అంటూ కొన్ని మీడియా సంస్థల సహాయంతో కోదండరాం మరియు ఇతర ఉద్యమ నాయకులతో కార్యక్రమాలు, చర్చలు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒక విధమైన వ్యతిరేకతను కలిగించే ప్రయత్నం చేసారు. టిడిపితో పెట్టుకున్న పొత్తుతో ఒక్కసారిగా ఆ విధమైన ప్రచారం ముగిసిపోయినట్లయింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నాయకత్వ లేమి వెన్నాడుతోంది. ఎంతో మంది నాయకులు ముఖ్యమంత్రి పీఠానికై రేసులో ఉన్నప్పటికీ ఎవరూ కెసిఆర్‌కు ధీటుగా కనిపించడంలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వంటి వారితో పాటు మొన్న పార్టీలో చేరిన రేవంత్ కూడా కార్యకర్తల చేత సీఎం అంటూ నినాదాలు చేయించుకుంటున్నారు. బిసి నాయకుడే సీఎం కావాలనే వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీ ఈ నాయకత్వ లేమిని లక్ష్యం చేసుకుని ఆంధ్రా నాయకుడైన చంద్రబాబు నాయకత్వంలో బరిలోకి దిగుతున్నారని, కూటమి అధికారంలోకి వస్తే నిర్ణయాలు అమరావతి, ఢిల్లీలలో జరుగుతాయని మళ్ళీ ఆత్మగౌరవ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇది ప్రతికూలంగా పరిణమించే అవకాశాలయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎలాంటి ఫలితాలు రావచ్చు?
క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే దిగ్గజాల వంటి నాయకులు ఉండటంతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి అనుకూలంగా కనిపిస్తోంది. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలలో కూడా కొంత సానుకూలమనే విశ్లేషణలు వస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో కూడా బలహీనపడినప్పటికీ తెలుగు దేశం సహాయంతో గట్టెక్కగలమని అధినాయకత్వం భావిస్తుంది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో కూటమి గత ఎన్నికలతో పోలిస్తే బలహీనపడింది. 2014లో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీసిన నిజామాబాద్, కరీంనగర్ మరియు మెదక్ జిల్లాలలో పార్టీ పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. ఇలాంటి సమస్యల మధ్య అధికారంలోకి రావడం ఈ సారి కూడా కష్టమే.
Post a Comment