భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వేసిన 63 మిలియన్ డాలర్ల నష్ట పరిహార దావాను అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ICC) యొక్క వివాద పరిష్కార కమిటీ (DRC) కొట్టివేసింది. దుబాయ్ లో మూడురోజుల పాటు రెండు బోర్డుల వాదనలు విన్న అనంతరం తీర్పును వెలువరించింది. వీరి మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటానికి కుదిరిన ఒప్పందానికి చట్టబద్ధత లేదని కూడా వ్యాఖ్యానించింది. ఈ తుది తీర్పుకు అందరూ కట్టుబడవలసి ఉంటుందని, అప్పీలు చేసుకోవటానికి కూడా వీలు లేదని తెలిపింది.
బిగ్ త్రీ ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేస్తే 2015-23 మధ్య కాలములో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడతామని భారత బోర్డు పాకిస్తాన్ బోర్డుకు లిఖిత పూర్వకంగా తెలిపింది. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు మరియు భద్రతా కారణాల రీత్యా మనదేశం పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించింది. మన దేశం ఆడకపోవడం వలన ఆర్థికంగా నష్టం వాటిల్లిందని పాకిస్తాను బోర్డు అంతర్జాతీయ క్రికెట్ బోర్డును ఆశ్రయించింది. బిగ్ త్రీ ఒప్పందం కూడా కొన్ని రోజుల కాలంలోనే రద్దు కావడం గమనార్హం.
కమిటీ తీర్పును భారత బోర్డు స్వాగతించింది. అంతే కాకుండా ఈ వివాదం సందర్భంగా బోర్డుకు అయిన వ్యయాలను పాకిస్తాన్ బోర్డు నుండి పొందటానికి దరఖాస్తు చేయనుంది. అంతర్జాతీయ క్రికెట్ సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు ఓడిపోయిన బోర్డు, గెలిచిన బోర్డుకు వ్యాజ్యానికి అయిన వ్యయాలను చెల్లించవలసి ఉంటుంది. కాగా పాకిస్తాన్ బోర్డు తుది తీర్పుపై తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. భవిష్యత్ కార్యాచరణను గురించి పరిశీలిస్తున్నామని కూడా పేర్కొంది.
Post a Comment