సర్జికల్ దాడులపై కేంద్రం అతిప్రచారం

29 సెప్టెంబర్ 2016న పాకిస్తాన్ భూభాగంపై సర్జికల్ దాడులు జరిపినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో దాదాపు 30 నుండి 50 మంది వరకు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కూడా తెలిపారు. దీనిని భారత ప్రభుత్వం ఒక అనితర సాధ్యమైన చర్యగా, తమ విజయంగా ప్రకటించింది. ఈ సంవత్సరం కూడా సర్జికల్ దాడుల దినోత్సవం జరుపుకోవాలంటూ అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ఈ దాడులు ప్రధానంగా వాటికి 11 రోజుల ముందు జరిగిన యురి ఘటన వలన ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతను తగ్గించేందుకు జరిగినవిగా వాదనలున్నాయి. కొంతమంది మాజీ సైనికాధికారులు కూడా ఇలాంటి దాడి ఇది మొదటిసారి కాదని, అప్పుడప్పుడు గుట్టుగా జరిగేవేనని, ప్రచారం మాత్రం చేసుకోలేదని ప్రకటించారు. పాకిస్తాన్ అయితే ఈ దాడులను అసలు ధ్రువీకరించలేదు. కానీ మన కేంద్ర ప్రభుత్వం, బిజెపి నేతలు మాత్రం రాజకీయ లబ్ధిని పొందటానికి సాధ్యమైనప్పుడల్లా ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. సర్జికల్ దాడుల దినోత్సవం కూడా అలాంటి ప్రయత్నంలో భాగమే.     

అమెరికా పాకిస్థాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై ఇప్పటివరకు నాలుగు వందలకు పైగా డ్రోన్ దాడులు జరిపింది. వీటిలో 2500 మందికి పైగా తీవ్రవాదులతో పాటు, దాదాపు 500 మంది ఇతరులు కూడా మరణించారు. ఒక్క 2010వ సంవత్సరంలోనే 122 దాడులు జరిగాయి అంటే నెలకు దాదాపు 10 దాడులు జరిగాయి. 2018లో కూడా ఇప్పటివరకు ఎనిమిది సార్లు డ్రోన్ దాడులు జరిపి 36మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాకిస్తాన్ గడ్డపై ఇన్ని దాడులు చేసిన అమెరికన్ ప్రభుత్వం కూడా  ఏనాడు మోడీ ప్రభుత్వంలా ఎదో సాధించినట్లు గొప్పలు చెప్పుకోలేదు.

అంతేకాక ఆఫ్ఘన్ సరిహద్ధు నుండి చెప్పుకోదగ్గ దూరంలో ఉండే అబ్బోట్టాబాద్ ప్రాంతంలో ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి కూడా అమెరికన్ దళాలు నిర్వహించింది కూడా సర్జికల్ దాడే. దీనిలో ప్రధానంగా వారు పాకిస్తాన్ భూభాగంలో దాడులు జరిపి ఒసామాను చంపినట్లు ప్రకటించారు తప్ప పాకిస్తాన్ పై పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు.    

సరిహద్దును దాటి వేరే దేశంపై దాడి చేయటం అనేది అంతర్జాతీయ నియమ నిబంధనలకు విరుద్ధం. ఇలా చేయటం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అవసరం కావచ్చు. అప్పుడు వాటిని రహస్యంగా ఉంచాలి కానీ వాటిని మోడీ, రాజనాథ్ సింగ్, అమిత్ షా వంటి జాతీయ స్థాయి నాయకులు ఊదరగొట్టడం, మళ్ళీ సర్జికల్ దాడులు నిర్వహిస్తామనటం అయితే సరైనది కాదు. రేపు పాకిస్తాన్ కూడా మన దేశంలో జరిగే ఏవైనా తీవ్రవాద ఘటనలను తమ సర్జికల్ దాడులుగా ప్రకటించవచ్చు. అంతెందుకు, ఇప్పటికే జరిగిన యురి ఘటనను, ఇతరత్రా కాశ్మీర్లో జరిగే సంఘటనలను తమ సర్జికల్ దాడులుగా ప్రకటించుకుంటే ఏం చేయగలరు? ముంబయి దాడుల వంటి సామాన్యులపై జరిగిన దాడులు ఉగ్రవాద చర్యల కిందకు వస్తాయి కాబట్టి ఇలాంటివి తప్ప మిగతా వాటికి పాకిస్తాన్ కూడా బహిరంగంగా మద్ధతు ప్రకటించవచ్చు. మీరూ చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం అనే వాదన ఇక్కడ చెల్లుతుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ప్రభుత్వం మీరు ఒక సర్జికల్ దాడి చేస్తే మేము పది దాడులు చేస్తాం అని ప్రకటించింది. 

సర్జికల్ దాడులలో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్లో కొన్ని కిలోమీటర్ల దూరం అవతల దాడి చేయటానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టింది. సాంకేతికత ఇంత అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా మన సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టడం దురదృష్టకరం. అదే అమెరికా అయితే ప్రిడేటర్ మరియి రీపర్ డ్రోన్లను ఉపయోగించింది. ఇవి 'స్టెల్త్'  పరిజ్ఞానంతో రూపొందిన డ్రోన్లు కాబట్టి వీటిని రాడార్లు పసిగట్టలేవు. ఒకవేళ కూలిపోయినా ప్రాణనష్టం ఉండదు. కాబట్టి ఇలా ప్రాణాలను ఫణంగా పెట్టి జరిపిన దాడులపై రొమ్ము విరుచుకునే బదులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధన ద్వారాగానీ, దిగుమతి చేసుకోవటం ద్వారాగానీ సముపార్జించుకునే మార్గాలపై దృష్టిపెడితే దేశానికి మేలుజరుగుతుంది.    

0/Post a Comment/Comments

Previous Post Next Post