మనదేశంలోని అతిపెద్ద ముడి చమురు మరియు సహజవాయువు అన్వేషణ సంస్థ - ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసి), ప్రభుత్వ యాజమాన్యంలోనే నడుస్తున్నప్పటికీ అత్యంత లాభదాయక సంస్థగా పేరు పొందింది. భారతదేశం ఇంధన రంగంలో అభివృద్ధి చెందటం కోసం 1956లో కేంద్ర ప్రభుత్వం చేత స్థాపించబడిన ఈ సంస్థ ఇప్పుడు దేశ ఇంధన భద్రత విషయంలో కీలక పాత్రను పోషిస్తుంది.
కొంతకాలం క్రితం వరకు ఈ ఓఎన్జీసి సంస్థకు భారీ మిగులు నిధులు బ్యాంకు బ్యాలన్సుల రూపంలో ఉండేవి. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ సంస్థ మిగులు నిధులన్నీ దాదాపుగా హరించుకుపోయాయి. గత సంవత్సరం అప్పులు లేకుండా 13 వేల కోట్లకు పైగా మిగులు నిధులతో అలరారిన ఈ సంస్థ ఇప్పుడు 35 వేల కోట్లకు పైగా అప్పులతో చేతిలో వేయి కోట్లు కూడా లేని పరిస్థితికి చేరుకుంది.
2017 ఆగస్టులో, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (జిఎస్పిసిఎల్) యొక్క 80 శాతం వాటాను ఓఎన్జీసి కొనుగోలు చేసేవిధంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి బేసిన్లో చమురు మరియు సహజ వాయువు బ్లాక్ లను వేలంలో తీసుకున్న గుజరాత్ సంస్థ ఇప్పటివరకు అసలు ఒక లీటరు చమురును వెలికితీసింది లేదు గానీ వేల కోట్ల నష్టాలలో, అప్పులలో మాత్రం కూరుకు పోయింది. సంస్థ కొనుగోలుకు 8000 కోట్ల రూపాయలతో పాటు, సంస్థకు ఉన్న దాదాపు 20వేల కోట్ల అప్పును కూడా ఓఎన్జీసి తీర్చవలసి వచ్చింది. ఇలా గుజరాత్ ప్రభుత్వాన్ని అప్పుల నుండి బయట పడవేయటానికి ఓఎన్జీసిని వాడుకున్నారు. ఈ సంస్థ కొనుగోలు వల్ల భవిష్యత్తులో కూడా నష్టాలే తప్పించి లాభం మాత్రం ఉండే అవకాశం లేదు. మిగిలిన రాష్ట్రాలకు అవసరార్థం నిధులు కావాలంటే సవాలక్ష కారణాలు, నిబంధనలు చెప్పి తప్పించుకునే మోడీ ప్రభుత్వం ఇలా కేంద్ర నిధులను గుజరాత్ రాష్ట్రానికి మాత్రం దోచి పెట్టింది.
గత నవంబర్లో, మన కేంద్రప్రభుత్వం ఓఎన్జీసి యొక్కలాభదాయకమైన ప్రధాన చమురు మరియు గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలలో ప్రైవేటు కంపెనీలకు 60% వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. కానీ సంస్థ ఉద్యోగుల నుండి వచ్చిన బలమైన వ్యతిరేకత కారణంగా ఈ ప్రయత్నం సఫలం కాలేదు.
2018 జనవరిలో, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్) లో కేంద్ర ప్రభుత్వం యొక్క 51.11 శాతం వాటాను 36,915 కోట్ల రూపాయలకి (369 బిలియన్ డాలర్లు) కొనుగోలు చేయవలసిందిగా ఒఎన్జిసిపై వత్తిడి తెచ్చింది. ఇలా ఒఎన్జిసి మార్కెట్ ధరకన్నా 14% ఎక్కువకు హెచ్పిసిఎల్ ను కొనుగోలు చేసింది. ఇప్పటికే ఐఒసిలో 13.77 శాతం వాటాను, గెయిల్లో 4.86 శాతం వాటాను ఓఎన్జిసి కలిగి ఉంది. ఈ కొనుగోళ్ళకు సంస్థ బ్యాంకుల నుండి 35వేల కోట్లను అప్పులుగా తీసుకుంది. ఇప్పుడు ఈ అప్పులను వదిలించుకోవటానికి కొన్ని చమురు క్షేత్రాలను, వాటాలను అమ్మకానికి పెట్టింది. అంతేకాక ఈ సంవత్సరం 8000 కోట్ల భారీ డివిడెండ్ ను ఈ సంస్థ నుండి కేంద్రం సంగ్రహించింది. ఇలా లాభాలు, మిగులుతో ఉన్న ప్రభుత్వ సంస్థను మోడీ ప్రభుత్వం అప్పులపాలు చేసింది.
Post a Comment